Congress Leader Digvijaya Singh's Car Hits Biker In Madhya Pradesh - Sakshi
Sakshi News home page

వీడియో: ర్యాష్‌ డ్రైవింగ్‌తో బైకర్‌ను ఢీ కొట్టిన దిగ్విజయ్‌ సింగ్‌ కారు.. దగ్గరుండి కేసు ఫైల్‌ చేయించిన నేత

Published Fri, Mar 10 2023 7:22 AM | Last Updated on Fri, Mar 10 2023 8:32 AM

Congress leader Digvijaya Singh Car hits biker Case Filed - Sakshi

బైకర్‌ను ఢీ కొట్టిన దృశ్యం.. ఇన్‌సెట్‌లో బాధితుడ్ని పరామర్శించిన దిగ్విజయ్‌ సింగ్‌

భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ కారు.. రోడ్డు ప్రమాదానికి కారణమైంది. గురువారం రాజ్‌గఢ్‌లో ఓ బైకర్‌ను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌కు గాయాలు కాగా, దిగ్విజయ్‌ సింగ్‌ దగ్గరుండి మరీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తన కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేయించి.. అరెస్ట్ చేయించి, దగ్గరుండి మరీ ఆ వాహనాన్ని పోలీసులతో సీజ్‌ చేయించారాయన.

గురువారం రాజ్‌గఢ్‌లోని కొడయాకా గ్రామంలో జిల్లా స్థాయి అధ్యక్షుల సమావేశం జరిగింది. దానికి హాజరైన దిగ్విజయ్‌ సింగ్‌ మధ్యాహ్నం తిరుగుపయనం అయ్యారు. ఆ సమయంలో జీరాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ వద్ద బైకర్‌ను వేగంగా ఢీ కొట్టింది డిగ్గీ రాజా ప్రయాణిస్తున్న కారు. ఆ కొట్టడంలో పది అడుగుల దూరం వెళ్లి పడ్డాడు బైకర్‌. వెంటనే కార్యకర్తలతో పాటు ముందు సీటులో కూర్చున్న ఆయన కారు దిగి.. బాధితుడ్ని కార్యకర్తల సాయంతో ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన వ్యక్తిని పరవాలియాకు చెందిన రాంబాబు బాగ్రి(20)గా గుర్తించారు. ప్రమాదం అనంతరం ఆస్పత్రికి వెళ్లి అతని పరిస్థితి గురించి ఆరా తీసి, అతన్ని పరామర్శించారు దిగ్విజయ్‌ సింగ్‌. దేవుడి దయ వల్ల యువకుడికి తీవ్ర గాయాలు కాలేదని, అతని చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని మీడియాకు చెప్పారాయన.  స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం అతన్ని భోపాల్‌కు రిఫర్‌ చేశారు వైద్యులు.

ఇదిలా ఉంటే.. తన కారు డ్రైవర్‌పై దగ్గరుండి పోలీసులతో కేసు నమోదు చేయించి అరెస్ట్‌ చేయించారు దిగ్విజయ్‌ సింగ్‌. అనంతరం వాహనాన్ని సైతం సీజ్‌ చేయించారు. జీరాపూర్‌ పోలీస్‌ వద్ద ఆ వాహనాన్ని వదిలేసి.. స్థానిక ఎమ్మెల్యే కారులో ఆయన వెళ్లిపోయారు.   

Disclaimer: పై వీడియో కేవలం సమాచార సంబంధిత పోస్ట్‌ మాత్రమే. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement