సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు, వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ‘సాధికార కార్యాచరణ బృందం–2024’ను ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. దాంతోపాటు పార్టీపరమైన మేధోమథన సదస్సు ఏర్పాటు చేయాలని పార్టీ చీఫ్ సోనియాగాంధీ నిర్ణయించారు. ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ పేరిట ఈ సదస్సు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మే 13 నుంచి 15 దాకా మూడు రోజుల పాటు జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు తెలిపారు.
సోమవారం జరిగిన కీలక సమావేశంలో సోనియా ఈ మేరకు నిర్ణయించినట్టు వివరించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడంపై ప్రశ్నించగా ఆయన నేరుగా బదులివ్వలేదు. ‘‘పీకే ప్రజెంటేషన్‌పై పార్టీ కమిటీ ఇచ్చిన నివేదిక, వచ్చే సాధారణ, అసెంబ్లీల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితరాలపై భేటీలో సోనియా చర్చించారు. అనంతరం సాధికార బృందం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సోనియా నివాసం 10, జన్‌పథ్‌లో జరిగిన 3 గంటలకు పైగా జరిగిన ఈ భేటీలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు’’ అని సుర్జేవాలా వెల్లడించారు.
రాజకీయ ప్యానల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి
2024 లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహం తదితరాలపై చింతన్ శిబిర్‌లో చర్చ జరుగుతుందని సుర్జేవాలా తెలిపారు. ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, సవాళ్లు, రైతులు, రైతు కూలీల సమస్యలు, యువత సంక్షేమం, శ్రేయస్సు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మత, భాషా మైనారిటీలు, మహిళా సామాజిక న్యాయం, సాధికారత తదితరాలపై చింతన్ శిబిర్‌లో లోతుగా చర్చించనున్నట్టు కాంగ్రెస్ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమ ప్రణాళికలకు సోనియా ఆమోదముద్ర వేశారు. తీర్మాన పత్రాలను తయారీ తదితరాలకు ఆరు సమన్వయ ప్యానళ్లను నియమించారు.
రాజకీయ తీర్మాన ప్యానల్లో ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అవకాశమిచ్చారు. ఈ ప్యానెల్‌కు మల్లికార్జున్ ఖర్గే కన్వీనర్. సామాజిక న్యాయం, సాధికారత ప్యానల్‌కు సల్మాన్ ఖుర్షీద్, ఆర్థిక ప్యానల్‌కు చిదంబరం, సంస్థాగత వ్యవహారాల ప్యానల్‌కు ముకుల్ వాస్నిక్, రైతాంగం, వ్యవసాయ రంగ ప్యానల్‌కు భూపీందర్ సింగ్ హుడా, యువజన వ్యవహారాల ప్యానల్‌కు అమరేందర్ సింగ్ వారింగ్ కన్వీనర్లు. చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ఏఐసీసీ సభ్యులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, ప్రత్యేక ఆహ్వానితులు 400 మందికిపైగా పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment