ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: మహమ్మారి మన జీవితాలను అతలాకుతలం చేసింది. వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో ఎందరో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. సామాన్యుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ట్రాన్స్‌జెండర్‌ల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారిలో చాలా మంది యాచక వృత్తిని పాటిస్తూ.. పొట్ట పోసుకుంటారు. లాక్‌డౌన్‌తో అన్ని బంద్ కావడంతో వారి జీవితాలు మరింత దుర్భరంగా మారాయి. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రాన్స్‌జెండర్లకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని సోమవారం ప్రకటించింది.
ఈ మేరకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘మహమ్మారి మూలంగా అందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో తమను ఆదుకోవాల్సిందిగా పలువురు ట్రాన్స్‌జెండర్లు ఫోన్, ఈమెయిల్స్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారి అభ్యర్థనల మేరకు ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ మొత్తం వారి రోజువారి కనీస అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. దీని గురించి ట్రాన్స్‌జెండర్స్ కోసం పని చేస్తున్న ఎన్‌జీఓలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు వారికి అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము’’ అన్నారు.
ఎలా దరఖాస్తు చేయాలి..
ట్రాన్స్‌జెండర్ వ్యక్తి లేదా.. వారి తరఫున సీబీఓలు ఎవరైనా సరే వారి ప్రాథమిక వివరాలు తెలుపుతూ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://forms.gle/H3BcREPCy3nG6TpH7 ఈ సైట్‌లో ఉన్న ఫామ్‌లో సదరు వ్యక్తులు తమ ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది అని తెలిపారు.
కౌన్సెలింగ్ సేవల కోసం హెల్ప్‌లైన్...
ట్రాన్‌జెండర్లకు మానసిక మద్దుతు, మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత హెల్స్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేశాం అని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ఎవరైనా హెల్ప్‌లైన్ నంబర్ 8882133897 కి కాల్ చేసి నిపుణులతో కనెక్ట్ కావచ్చు. ఈ హెల్ప్‌లైన్ సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 11-01, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య పనిచేస్తుంది.
చదవండి: ట్రాన్స్... అప్‌డేట్ వెర్షన్
Comments
Please login to add a commentAdd a comment