సాక్షి, న్యూఢిల్లీ: దేవభూమి ఉత్తరాఖండ్ ఇప్పుడు కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుంటోంది. హరిద్వార్‌లో జరుగుతున్న మహా కుంభ్‌మేళాలో షాహీ స్నానాల సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేసినప్పటి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో కుంభ్ మేళా కాస్తా కరోనా మేళాగా రూపాంతరం చెందుతోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 28 వరకు 172 మందికి మాత్రమే కరోనా సోకినట్లు గుర్తించారు.
ఈ సంఖ్య ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ 15 రోజుల్లో రాష్ట్రంలో 15,333 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఫిబ్రవరితో పోలిస్తే ఏప్రిల్ కల్లా కరోనా పాజిటివ్ కేసుల వృద్ధిరేటు 8814% గా నమోదైంది. మహా కుంభ్‌మేళాలో పాల్గొన్న సాధువుల్లో అధికారిక గణాంకాల ప్రకారం 49 మంది సాధువులకు కరోనా సోకగా అందులో రెండవ అతిపెద్ద అఖాడాకు చెందిన ప్రధాన సాధువు మహామండలేశ్వర్ కపిల్ దేవ్ దాస్ (65) చనిపోయారు.
ఇది అధికారిక సంఖ్య మాత్రమే. కానీ వైరస్ సోకిన సాధువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా. వివిధ అఖాడాల్లో సాధువుల ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి అఖాడాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలను వేగవంతం చేయనున్నారు. మరోవైపు షాహీ స్నానాల అనంతరం మహాకుంభ్ మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారిపోయిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. హరిద్వార్ జిల్లాలో కుంభమేళా సమయంలో 2,483 మందికి కరోనా ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు గుర్తించారు.
నేటితో కుంభ్‌మేళా పూర్తి: నిరంజని, ఆనంద్ అఖాడాలు
కుంభ్‌మేళాకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో ఉత్తరాఖండ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. గత రెండు వారాలుగా, రాష్ట్రంలో ప్రతి ఒకటిన్నర నిమిషానికి ఒకరు కరోనా బారిన పడుతున్నారు. అయితే కుంభ్‌మేళాను నేటితో ముగించనున్నట్లు నిరంజని అఖాడా, ఆనంద్ అఖాడాలు ప్రకటించాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దృష్టిలో నేటితో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి మహంత్ రవీంద్ర పూరి తెలిపారు.
అయితే కుంభమేళా ముగిసిందని ప్రకటించిన ఆయనకు కరోనా సోకినట్లు శుక్రవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అఖాడాల్లోని ఇతర సాధువులలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు మరో 16 మంది సాధువులను కూడా కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అదే సమయంలో అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు నరేంద్ర గిరికి ఏప్రిల్ 11న కరోనా పాజిటివ్‌గా తేలింది.
ముగింపుపై సాధువుల ఆగ్రహం..
కరోనా సంక్రమణను పరిగణనలోకి తీసుకుని మహా కుంభ్‌మేళాను నేటితో మూసివేస్తున్నట్లు నిరంజన్, ఆనంద్ అఖాడాలు ప్రకటించిన తరువాత, సాధువులలో ప్రతిష్టంభన ఏర్పడింది. కుంభ్ రద్దు ప్రకటనపై ఒకవైపు బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు జగద్గురు శంకరాచార్యుల శిష్యుడైన స్వామి అవిముక్తేశ్వరానంద నిర్ణీతకాలం వరకు కుంభ్ కొనసాగుతుందని ప్రకటించారు. కుంభ్‌మేళా ఏ ఒక్క సంస్థ లేదా అఖాడాలకు చెందినది కాదని స్వామి అవిముక్తేశ్వరానంద తెలిపారు. నిరంజని అఖాడా కుంభ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించడంపై బైరాగి సాధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరంజని, ఆనంద్ అఖాడాలకు చెందిన సాధువులు తాము చేసిన ప్రకటనపై క్షమాపణ చెప్పాలని నిర్మోహి, నిర్వాణి, దిగంబర్ అఖాడాలు డిమాండ్ చేశాయి. కుంభ్‌మేళాను ముగించే హక్కు ముఖ్యమంత్రికి, మేళా అడ్మినిస్ట్రేషన్‌కు మాత్రమే ఉందని వారు ప్రకటించారు. కుంభ్ ముగిసిందని ప్రకటించిన సాధువు క్షమాపణ చెప్పకపోతే, అతను అఖాడా కౌన్సిల్‌లో కొనసాగలేడని తేల్చిచెప్పారు. ఏదేమైనా కుంభ్‌మేళా కొనసాగుతుందని, ఏప్రిల్ 27న బైరాగి సాధువులందరూ షాహీ స్నానాలు చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment