సాక్షి, ముంబై: రాష్ట్రంలోని 2,894 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో 2,212 మంది టీచర్లు ఉండగా, 682 ఉపాధ్యాయేతర సిబ్బంది ఉన్నారు. తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయులు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు 2,27,775 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో 1,51,539 మంది టీచర్లకు కరోనా పరీక్షలు పూర్తికాగా, 2,212 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరోవైపు 92,343 మంది ఉపాధ్యాయేతర సిబ్బంది ఉండగా, వీరిలో 56,034 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 682 మందికి కరోనా వచ్చినట్లు తెలిసింది. డిసెంబర్ ఆఖరి వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రం కానున్న నేపథ్యంలో కరోనా మళ్లీ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందరు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
విద్యార్థుల బడి బాట
రాష్ట్రంలోని ఏడు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన పాఠశాలకు విశేష ఆదరణ లభిస్తుండటంతో మరిన్ని పాఠశాలలను ప్రారంభించారు. అలాగే పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గత పది రోజుల్లో విద్యార్థుల హాజరు శాతం దాదాపు రెట్టింపు అయిందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా 8 జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనా ఉన్నాకూడా తల్లిదండ్రులు వారి పిల్లలను పాఠశాలలకు పంపుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో పలువురికి కరోనా సోకుతుండటం భయాందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 25,866 పాఠశాలలు, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. చదవండి: (21వ శతాబ్దపు పౌరులకు టీచర్‌ను!)
వీటిలో 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్‌లలో చదివే విద్యార్థుల సంఖ్య 59,27,456గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నవంబర్ 23వ తేదీ నుంచి 35 శాతం అనగా 9,127 పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోగా కేవలం 2,99,193 మంది విద్యార్థులు హాజరయ్యా రు. ప్రస్తుతం ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. స్కూళ్లు, కాలేజీలకు వస్తున్న విద్యార్థు ల సంఖ్య పెరుగుతుండటంతో తాజాగా మరో రెండు వేలకుపైగా పాఠశాలలు ప్రారం భమయ్యాయి. దీంతో డిసెంబర్ 3వ తేదీ వర కు అందిన వివరాల మేరకు రాష్ట్రంలో మొ త్తం 11,296 పాఠశాలలు తెరుచుకున్నాయి. అదేవిధంగా పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయిం దని చెప్పవచ్చు. ప్రారంభంలో కేవలం 2,99,133 మంది విద్యార్థుల హాజరుకాగా ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగిన 4,88,222కు చేరిందని విద్యా శాఖ పేర్కొంది. చదవండి: (న్యూ ఇయర్ జోష్‌కు బ్రేక్)
ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికి పైగా..
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. గడ్చిరోలి, ఉస్మానాబాద్, సాతారా, లాతూర్, షోలాపూర్, చంద్రాపూర్, ధులే, నాందేడ్ జిల్లాల్లో 90 శాతానికిపైగా పాఠశాలలు తెరుచుకున్నాయి. మరోవైపు అకోలా, యావత్మాల్, జాల్నా, ఔరంగాబాద్, నందుర్బార్, రత్నగిరి, సింధుదుర్గా, వర్దా జిల్లాల్లో 60 శాతానికిపైగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు ప్రారంభంకాని జిల్లాల్లో కూడా అక్కడి పరిస్థితులను అనుగుణంగా తొందర్లోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment