మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. కరోనా వేవ్ క్రమేణా పెరుగుతోంది.. పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతోంది.. ఈ క్రమంలో కోవిడ్ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. విద్యాసంస్థల మూసివేత దిశగా సమాలోచనలు జరుపుతోంది.. ఆలయాల్లో పలు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది.. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారంలో నిబంధనలను తప్పనిసరి చేసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై : రాష్ట్రంలో కరోనా కలవరం మళ్లీ మొదలైంది. చికిత్స పొందుతున్నవారి సంఖ్య సుమారు 8వేలకు చేరుకుంటోంది. 9 జిల్లాలో మరణాలు సైతం నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా చెన్నైనలో వారంలోపే 5.5శాతం కరోనా పాజిటివ్ కేసులు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రతి వంద కోవిడ్ పరీక్షల్లో రెండు పాజిటివ్ కేసులు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ సోమవారం వెల్లడించడం గమనార్హం.
విద్యాసంస్థల మూత?
లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది మార్చిలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో 9,10,11,12 తరగతుల కోసం 3 నెలల క్రితమే విద్యాసంస్థలను ప్రారంభించారు. మళ్లీ పాజిటివ్ కేసుల పెరుగుతుండడంతో 9,10,11 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు మొదలెట్టారు. 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇవి కూడా ఆన్‌లైన్‌కే మార్చేయాలని ఉన్నత విద్యాశాఖ భావిస్తోంది. ఈక్రమంలో ఆ శాఖ సంచాలకులు వివిధ వర్సిటీల వైస్ చాన్సలర్లతో సోమవారం సమావేశయమ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులు నిర్వహించాలా..? లేదా విద్యాసంస్థలను మూసివేయాలా..? అనే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఆలయాల్లో ఆంక్షలు
కరోనా కట్టడిలో భాగంగా ఆలయాల్లో తీర్థప్రసాదాల వితరణ, అర్చనపై నిషేధం విధించారు. పంగుణి మాసంలో నిర్వహించే ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ముఖ్యంగా 28వ తేదీన పంగుణి ఉత్తిరాం రోజును పురస్కరించుకుని పెరుమాళ్, అమ్మవారు, మురుగన్‌న్, శివాలయాల్లో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే కరోనా ప్రబలుతున్న తరుణంలో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని దేవదాయ, ధర్మాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా కలకలం
చెన్నై పెరుంగుడి మండలంలోని ఓ ఐటీ సంస్థలో 40 మంది ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. ఈ క్రమలో ఈ ఐటీ సంస్థకు చెందిన తరమణి, పెరుంగుడి, కందన్‌చావడిల్లో శాఖలను మూసివేయాలని కార్పొరేషన్ అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం ముమ్మరం కావడంతో ఉత్తరాది కార్మికులు సొంతూరి బాట పడుతున్నారు.
అభ్యర్థుల్లో ఆందోళన
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు కరోనా సోకింది. చెన్నై వేలాచ్చేరీ మక్కల్ నీది మయ్యం అభ్యర్థి సంతోష్‌బాబు కోవిడ్ చికిత్స పొందుతున్నారు. అదే పార్టీకి చెందిన అన్నానగర్ అభ్యర్థి పొన్‌రాజ్ హోం క్వారంటైన్‌కు వెళ్లారు. సేలం దక్షిణం నుంచి పోటీచేస్తున్న డీఎండీకే అభ్యర్థి అళగాపురం మోహన్‌రాజ్‌కు పాజిటివ్ రావడంతో సోమవారం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ క్రమంలో విధిగా మాస్క్‌లు ధరించే ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే చెన్నైలో కోవిడ్ విధులు నిర్వర్తించేందుకు వైద్యులు సైతం విముఖత చూపుతున్నారు. బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తే ఆందోళనకు దిగుతామని తమిళనాడు ప్రభుత్వ వైద్యుల సంఘం ఇప్పటికే ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment