న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే గరిష్ట స్థాయిలో 8,593 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,59,975కు చేరింది. మరణాల రేటు కూడా పెరుగుతూ పోతోంది. గడిచిన 24 గంటల్లో 85 మంది మృతి చెందారు. ఇంత మొత్తంలో మరణాలు నమోదుకావటం ఇది రెండో సారి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 42,629గా ఉంది. పండుగ సీజన్, శీతాకాలం ప్రారంభంతో కాలుష్యం పెరిగి ఈ మహమ్మారి వ్యాప్తి మరింత అధికమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గత రెండు వారాల్లో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలను తెలపాలంది. రోజువారి కేసుల సంఖ్య మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను మించిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఎలాంటి పటిష్టమైన చర్యల్ని తీసుకుంటోందని అడిగింది. (భారత్‌లో కొత్తగా 47,905 కరోనా కేసులు)
ఇతర రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధిస్తుంటే ఢిల్లీలో మాత్రం అటువంటి నిబంధనలు పాటించటం లేదని.. ఈ పరిణామం వల్ల కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ అవుతుందని హెచ్చరించింది. ప్రభుత్వం రానున్న పండుగల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి పరీక్షల సంఖ్య పెంచుతున్నామని తెలిపింది. షాపింగ్ మాల్స్‌లలో సిబ్బందికి, వినియోగదారులకు కూడా పరీక్షలు నిర్వహిస్తామని.. రెస్టారెంట్లలోని సిబ్బందికి, రద్దీ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరిక్షల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17వేల టెస్టులు చేశామని, టెస్టులను పెంచుతున్నామని.. రాబోయే రెండు రోజుల్లో కేసులు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment