సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న నేపధ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశాలకు సిద్ధం అవుతున్న రాజ్యసభ సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పనులన్నీ ఆగస్ట్ మూడో వారంకల్లా పూర్తి చేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఆదేశాలు ఇచ్చారు. కరోనా నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను హతమార్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
కాగా సెప్టెంబర్ మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం లోక్‌సభ, సాయంత్రం రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. ప్రతి రోజు నాలుగు గంటల పాటు సమావేశాలను నిర్వహించనున్నారు. దాదాపు రెండు వారాల పాటు సమావేశాలు కోనసాగే అవకాశం ఉంది. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలు జరగాలని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న తరుణంలో సమావేశాలను నియమాలకు అనుగుణంగా నిర్వహించనున్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన స్పష్టమైన షెడ్యుల్ ఇంకా వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment