సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య భారత్‌లో గణనీయంగా పడిపోతోంది. సెప్టెంబర్ 10వ తేదీ నాటికి కరోనా మృతుల సంఖ్య 1.7 శాతానికి పడిపోయింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మరణిస్తోన్న కరోనా రోగుల సగటు సరాసరి కన్నా ఎంతో తక్కువ. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి దేశంలో కరోనా మృతుల సంఖ్య 2.65కు చేరుకున్నప్పటకీ అభివృద్ధి దేశాలకన్నా తక్కువే. భారత్‌కన్నా ఎన్నో రెట్లు వైద్య విజ్ఞానం, వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న అమెరికా, బ్రిటన్‌లో ఎందుకు ఎక్కువ మంది మరణిస్తున్నారు? భారత్‌లో ఎందుకు తక్కువ మంది మరణిస్తున్నారు?
సకాలంలో లాక్‌డౌన్‌ను విధించి కచ్చితంగా అమలు చేయడం వల్ల, సకాలంలో స్పందించి దేశవ్యాప్తంగా వైద్య సేవలను విస్తరించడం వల్లనే ఇది సాధ్యమైందని అటు కేంద్రమే కాకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఘనంగా చెప్పుకుంటున్నాయి. అయితే ఈ వాదనలో నిజం లేదని, భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం వల్ల యువతకే కరోనా ఎక్కువగా సోకిందని, వారే యవ్వనం రీత్యా మృత్యువాత నుంచి తప్పించుకోగలిగారని, మరోపక్క భారత్‌లో కరోనా బారిన పడి మరణిస్తోన్న వృద్ధతరంలో ఎక్కువ మంది చావులు లెక్కలోకి రాకుండా పోతున్నాయని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి మరణంతోపాటు ఆ మరణానికి కారణం ఏమిటో అధికారికంగా నమోదవుతుంది. ఓ వ్యక్తి ఏ కారణంతో చనిపోయారో తెలియకపోతే ఆ దేశాల్లో మృత దేహాలకు అటాప్సీ చేసి మరీ మరణ కారణాన్ని నమోదు చేస్తారు.
సాధారణ పరిస్థితుల్లోనే భారత్‌లో 70 శాతం మరణాలు ప్రభుత్వ లెక్కల్లోకిగానీ, దృష్టికిగానీ రావు. దేశంలో కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రతి చావుకు కారణం నమోదు చేయమని, అందుకు ప్రతి అనుమానిత మృత దేహానికి కరోనా పరీక్షలు జరిపించాలంటూ పలు హైకోర్టులు ఇచ్చిన పిలుపులను అమలు చేయడం తమ వల్ల కాదంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే చేసింది. భారత్‌లో కరోనా బారిన పడిన యువత కోలుకుంటుండడం, కరోనాతో మరణించిన వృద్ధుల లెక్కలు కరోనా లెక్కల్లోకి రాకపోవడం వల్లనే భారత్‌లో కరోనా మృతుల సంఖ్య తక్కువగా ఉందని పలు నివేదికలు వాదిస్తున్నాయి. (చైనాలో మరో ‘అద్భుతం’.. అదేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment