
బెంగళూరు: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం రద్దైన ఎన్నికల బాండ్ల పేరిట మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు చట్టసభల ప్రతినిధుల న్యాయస్థానం తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది.
కాగా పలువురు పారిశ్రామికవేత్తలను నిర్మతా సీతారామన్ బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని జనాధికార సంఘర్షపరిషత్తుకు చెందిన ఆదర్శ్ గతంలో తిలక్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి సంతోశ్ గజానన ధర్మాసనం..నిర్మలపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను అక్టోబర్ 10కి వాయిదా వేశారు.
కోర్టు ఆదేశాలతో నిర్మలా సీతారామన్, ఇతరులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతోపాటు ఎఫ్‌ఐఆర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ నతేలు, నలీన్ కుమార్ కటీల్, బీఐ విజయేంద్ర పేర్లను కూడా చేర్చారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులతో ఒత్తిళ్లు పెంచి కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలతో ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను జాతీయ, రాష్ట్ర స్థాయిలలోని బిజెపి నాయకులు నగదుగా మార్చుకున్నారని తెలిపారు.
కాగా నగదు రూపంలో పార్టీలకు ఇచ్చే విరాళాలకు బదులుగా బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చే పథకాన్ని కేంద్రప్రభుత్వం 2018లో తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. అయితే,ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గత ఫిబ్రవరిలో ఈ బాండ్ల విధానాన్ని రద్దు చేసింది. ఇది ప్రజల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది
Comments
Please login to add a commentAdd a comment