సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 మహమ్మారి సంబంధిత సమాచారాన్న సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రుల్ల పడకలు, లేదా ఆక్సిజన్ కొరత లాంటి సమాచారంపై ఎలాంటి అదుపు ఉండకూదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరా, మందులు, వ్యాక్సిన్ విధానానికి సంబంధించిన సమస్యలపై సుమోటో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జాతీయ సంక్షోభంలో ఉన్నామని వ్యాఖ్యానించిన జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఎల్ నాగేశ్వరరావు, రవీంద్ర భట్‌తో కూడిన ధధర్మాసనం ఈ సంక్షోభ కాలంలో బాధను పంచుకుంటున్న ప్రజలను అడ్డుకోవడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. అసలు నేషనల్ వ్యాక్సినేషన్ విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదని సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది.
పౌరులు తమ ఫిర్యాదులను సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్‌లో తెలియజేస్తే, అది తప్పు సమాచారమని చెప్పలేమని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే అలాంటి సమాచారాన్ని షేర్ చేసిన వారిని వేధింపులకు గురిచేస్తే దానికి కోర్టు ధిక్కరణ కిందే పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందేశం అన్ని రాష్ట్రాలు, డీజీపీలకు చేరాలని తేల్చి చెప్పింది. కరోనాకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చరాదని చంద్రచూడ్ అన్నారు. కోవిడ్ -19 సంక్షోభాన్ని నిర్వహించడానికి కేంద్రం తీసుకున్న చర్యలకు సంబంధించి ప్రశ్నలను లేవనెత్తిన ధర్మాసనం, కేంద్రం , రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాపై కచ్చితమైన సమాచారాన్నందించే యంత్రాంగాన్ని ఒకదాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది.
దేశవ్యాప్తంగా మే 1 నుంచి మూడోదశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు. అంతేకాదు ఒక వ్యాక్సిన్‌కు రెండు ధరలు ఎందుకని ప్రశ్నించింది.మొత్తం వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదనీ, కేంద్రానికి, రాష్ట్రాలకు రెండు ధరలు ఎందుకని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. 18-44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకాకరణ నమూనానే అనుసరణీయమని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరక్షరాస్యుల వ్యాక్సిన్ నమోదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్ధారిస్తాయని కూడా నిలదీసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టళ్లు, దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రదేశాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఈసందర్భంగా కోరింది. అలాగే, ఆరోగ్య సంరక్షణ రంగం సంక్షోభంలో పడిన ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ వైద్యులు,ఇతర అధికారులను తిరిగి నియమించాలని ధర్మాసనం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment