
బనశంకరి: కోవిడ్‌ను కట్టడికి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన వీకెండ్ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ నిబంధనలు సోమవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగనున్నాయి. శని, ఆదివారాల్లో ఉదయం 6 నుంచి పది గంటల వరకు కూరగాయలు, ఇతర అత్యవసరాల కొనుగోలుకు అవకాశం ఇస్తారు. విమానాలు, రైళ్లలో వెళ్లే ప్రయాణికులు టికెట్లు చూపించాల్సి ఉంటుంది. హోటల్, రెస్టారెంట్లలో పార్శిల్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. బస్సులు, టెంపోలు, క్యాబ్స్‌లో 50 శాతం కెపాసిటీతో ప్రయాణించవచ్చు. శని, ఆదివారాల్లో బెంగళూరులో మెట్రో రైళ్లను పూర్తిగా నిలిపివేస్తారు. సోమవారం ఉదయం 7గంటలకు మెట్రో రైళ్ల సంచారం ప్రారంభమవుతుంది. వివాహాలకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందికే అనుమతించారు.
ఆక్సిజన్ పంపండి: యెడ్డీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకకు 1,471 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ శుక్రవారం పది రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ కర్ణాటకలో కరోనా టీకా పంపిణీ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. నాలుగైదు రోజుల్లో వైరస్ అదుపులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ వినియోగం రోజురోజుకీ పెరుగుతోందన్నారు. గురువారం ఒక్కరోజే 500 టన్నుల ఆక్సిజన్ వినియోగించినట్లు తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత ఆక్సిజన్ నిల్వలు ఖాళీ అవుతాయని, 1,471 టన్నుల ఆక్సిజన్ కేంద్రం నుంచి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్
Comments
Please login to add a commentAdd a comment