
ఢిల్లీలోని ఓ మార్కెట్‌లో కరోనా నిబంధనలను పట్టించుకోని జనం
న్యూడిల్లీ: ఢిల్లీ కరోనా గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. కాలుష్యం కారణంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకి 7 వేలకు పైగా కేసులు నమోదవుతుంటే, గత 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. గత అయిదు నెలల కాలంలో ఢిల్లీని కరోనా ఈ స్థాయిలో వణికించడం ఇదే. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కాలుష్యం పెరిగిపోయి కేసులు కూడా పెరుగుతున్నాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏడు నుంచి 10 రోజుల్లో కరోనా నియంత్రణలోకి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. ‘‘గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వాటిని నియంత్రించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మరో వారం రోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుంది’’ అని కే్రజ్రీవాల్ చెప్పారు. వాయు కాలుష్యం వల్లే కేసులు పెరిగిపోతున్నాయని, పంట వ్యర్థాల దహనం వచ్చే ఏడాది నాటికి ఉండకూడదని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
44 వేల కొత్త కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో 44,879 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 87,28,795కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 547 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,28,668కు చేరుకుందని తెలిపింది. ఇదిలా ఉండగా దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శుక్రవారానికి 81,15,580కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.97 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,84,547గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 5.55 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.47గా ఉంది. గత 24 గంటల్లో సంభవించిన కరోనా మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 122 మంది మరణిం చారు. ఈ నెల 12 వరకూ 12,31,01,739 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. గురువారం మరో 11,39,230 పరీక్షలు జరిపినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment