సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ మరియు అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ‍్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకేఅవకాశం ఉందని తెలిపారు.అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని విషయాలను ఆయన వివరించారు.
దేశవ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ రానుంది, కానీ కేసుల ఉధృతి మాత్రం రెండో వేవ్ కంటే తక్కువగానే ఉంటుందని డాక్టర్ పాండా ఎన్‌డీటీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణిస్తే అది థర్డ్ వేవ్ విస్తరణకు దారి తీస్తుందన్నారు.
ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా దాటేసే పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే కొత్త వేరియంట్‌ను రోగనిరోధక శక్తి నిరోధించినా, వేగంగా విస్తరించే లక్షణంతో లాంటి రెండు కారణాలు థర్డ్‌వేవ్‌కు కారణంగావచ్చు అని పాండా తెలిపారు. ఇక నాలుగవ కారణంగా కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే, అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని డాక్టర్ పాండా చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ ఇప్పటికే దేశాన్ని తాకాయి కనుక డెల్టా వేరియంట్ వలన ముప్పు ఉండకవపోచ్చని అభిప్రాయపడ్డారు.
కాగా థర్డ్‌వేవ్ అనివార్యమని ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్ విస్తరణ ద్వారా కోవిడ్ -19 మూడో దశ "ప్రారంభ దశలో" ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. సుమారు 111 కి పైగా దేశాలలో దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment