![Covid Hug Threat To Mamata Banerjee, Complaint Against BJP Leader - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/28/anu.gif.webp?itok=fDKMC8FK)
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ నూతన జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన అనుపమ్ హజ్రాపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తనకు కరోనా వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటానంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళ, పార్టీ అధినేత్రిపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తృణమూల్ కాంగ్రెస్ రెఫ్యూజీ సెల్ సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
కరోనా కేసుల విషయంలో టీఎంసీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో అనుపమ్ హజ్రా మాట్లాడుతూ, ‘నాకు ఏదో ఒక సమయంలో కరోనా వస్తుంది. నేను అప్పుడు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కౌగిలించుకుంటాను. అప్పుడు ఆమెకు ప్రజలు పడుతున్న కష్టం, ప్రియమైన వారిని కోల్పోతే కలిగే బాధ తెలుస్తాయి’ అని వ్యాఖ్యానించారు. అయితే బెంగాల్‌లోని బీజేపీ నాయకులు హజ్రా వ్యాఖ్యలపై నోరు మెదపడంలేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని బీజేపీకి నూతనంగా ఎన్నికైన ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ అన్నారు.
ఇదిలా వుండగా మూడు రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం సిలిగురికి వెళ్లారు. ఉత్తర బెంగాల్‌లో పరిస్థితులపై మమతా సమీక్షించనున్నారు. ఇప్పటి వరకు బెంగాల్‌లో 2.4 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 4,721 మంది మరణించారు. చదవండి: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment