కోల్‌కతా : దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కట్టడిలో విధులు నిర్వహిస్తున్న కరోనా వారియర్స్ సైతం కోవిడ్ బారినపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా కరోనా కారణంగా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో భాగంగా మమతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు రాష్ర్టంలో 12మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనాకు బలయ్యారని ఆమె పేర్కొన్నారు. (కరోనాపై పోరులో మహిళా అధికారి కన్నుమూత)
కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్‌గా ఉన్న వైద్యులు, పోలీసులు, ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా వైరస్ బారిన పడి మరణిస్తే 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తామని మమతా స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రైవేటు రంగంలోని వారికి కూడా ఇదే విధమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని తెలిపారు. రాష్ర్టంలో కరోనా కేసులు అధికమవుతున్నందున ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. రానున్న కాలంలో టెస్టింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచుతామని ఆమె పేర్కొన్నారు. గత 24 గంటల్లోనే రాష్ర్ట వ్యాప్తంగా అత్యధికంగా 1,589 కొత్త కరోనా కేసులు నమోదుకాగా 20 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,427కు చేరుకుంది. (మంత్రి భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ )
Comments
Please login to add a commentAdd a comment