సాక్షి, న్యూఢిల్లీ: కరోనా బారిన పడి కోలుకున్నవారు వ్యాక్సిన్ తీసుకోవడానికి సంబంధించి పలు అనుమానాలున్న తరుణంలో నిపుణుల కమిటీ కీలక సలహాలిచ్చింది. కరోనా నుంచి కోలుకున్నవారు ఆరు నెలలకు వ్యాక్సిన్ తీసుకోరాదని నిపుణుల ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గ్యాప్ 12-16 వారాలకు పెంచాలని కేంద్రానికి జాతీయ సాంకేతిక సలహా బృందం కీలక సూచనలు చేసింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ సిఫారసులు చేసినట్టు తెలుస్తోంది.
అయితే దేశవ్యాప్తంగా వినియోగిస్తోన్న మరో టీకా కోవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంపై ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవాగ్జిన్ డోసుల్లో మార్పులేదని స్పష్టం చేసింది. కోవీషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని గతంలోనే కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. కరోనా టీకా డోసుల మధ్య వ్యవధిని 28 రోజుల నుంచి 6-8వారాలకు పెంచుతూ మార్చిలో నిర్ణయం తీసుకుంది. గర్భిణి స్త్రీలు తాము ఏ వ్యాక్సిన్ వేసుకోవాలో నిర్ణయించుకోవచ్చని తాజాగా కమిటీ సూచించింది. డెలివరీ తర్వాత, పాలిచ్చే సమయంలో వ్యాక్సిన్ తీసు కోవచ్చునని పేర్కొంది.
టీకా మొదటి మోతాదు తీసుకున్న తరువాత కోవిడ్ పాజిటివ్ వస్తే ..రెండవ డోసు తీసుకునేందుకు కోలుకున్న తరువాత నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలని ప్యానెల్ సిఫారసు చేసినట్లు తెలిసింది. అలాగే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ప్లాస్మా తీసుకున్న కోవిడ్ బాధితులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మూడు నెలల వరకు టీకాను వాయిదా వేయాలి. హాస్పిటలైజేషన్ లేదా ఐసీయూలో చికిత్స లాంటి ఇతర తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా తదుపరి టీకా తీసుకునే ముందు నాలుగు నుండి ఎనిమిది వారాల వరకు వేచి ఉండాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుత ప్రోటోకాల్ ప్రకారం, కోవిడ్ సంక్రమణ నుండి కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత ఈ టీకా తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment