న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా ముప్పు విషయంలో వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించకుండా భ్రమల్లో జీవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పుత్నిక్ వీ టీకాను భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడాన్ని ఒక మంచి అవకాశంగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా బారినపడని కుటుంబం ఒకటి కూడా లేదని పేర్కొంది. ఈ దేశాన్ని ఇక దేవుడే రక్షించాలని కఠిన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారిని సరిగ్గా ఎదుర్కోవడం లేదని కేంద్రంపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘ఎవరూ తెలివిగా వ్యవహరించడం లేదు. లక్షలాది డోసుల టీకాలను దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశంపై తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాల్లో అత్యున్నత స్థాయి నుంచి 30 నిమిషాల్లోగా ఆదేశాలు వచ్చేలా చూడాలి. ఇలాగే వ్యవహరిస్తే మరణాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు ఏదో ఒక కోర్టు మిమ్మల్ని చీల్చి చెండాడుతూనే ఉంది. అయినా మీలో చలనం లేదు. మీకు ఆదేశాలు ఇస్తున్న అధికారులు ఎవరు? వారికి విచక్షణ ఉందా? ఈ దేశాన్ని ఇక దేవుడే రక్షించాలి’ అని కోర్టు మండిపడింది.
స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తి కోసం తక్షణమే నిధుల విడుదల కోరుతూ పానసీయా బయోటెక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ టీకా ట్రయల్ బ్యాచ్‌లను ఉత్పత్తి చేశామని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా జవాబివ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment