న్యూఢిల్లీ: ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పర్యటించారు. ఒడిశాలోని భద్రాక్ బాలేశ్వర్ జిల్లాల్లో, పశ్చిమ బెంగాల్‌లోని పూర్బా మెడినిపూర్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే చేపట్టారు. అనంతరం ఒడిశా, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద రూ.1,000 కోట్ల ఆర్ధిక సహాయం ప్రకటించారు.
భువనేశ్వర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పునరావాస చర్యలకు సంబందించి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాస్ తుపాను కారణంగా గరిష్ట నష్టం ఒడిశాలో జరిగిందని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా ప్రభావితమైనట్లు ప్రధానికి అధికారులు వివరించారు. ఇందులో ఒడిశాకు రూ.500 కోట్లు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు కలిపి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు.
ఈ క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణానికి అవసరమయ్యే అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. తుఫాను కారణంగా బాధపడుతున్న వారందరికీ ప్రధాని తన సంపూర్ణ సంఘీభావం తెలిపారు. తుఫాను కారణంగా తుపాను వల్ల చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సందర్శించడానికి ఒక మంత్రి బృందాన్ని నియమించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన ఆధారంగా మరింత సహాయం అందించనున్నట్లు తెలిపింది.
చదవండి: యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
Comments
Please login to add a commentAdd a comment