ఇంజనీర్ మాదిరిగా ఓ రేంజ్‌లో ఇల్లు కడుతున్నాడు రైతు. సాధారణ ఇళ్ల మాదిరిగా కాకుండా అత్యంత వినూత్నంగా కడుతున్నాడు. దాన్ని చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. వచ్చిన ప్రతిఒక్కరు ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన డార్జిలింగ్ జిల్లాలోని పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ బెంగాల్‌లోని నిచ్‌బారి గ్రామంలో ఉండే మింటు రాయ్(52) అనే రైతు ప్రసిద్ధ రాయల్ మెయిల్ స్టీమర్(ఆర్‌ఎంఎస్) అనే టైటానిక్ ఓడను పోలి ఉండే మూడంతస్తుల ఇంటిని నిర్మిస్తున్నాడు. దీన్ని ఆ రైతు 2010 నుంచి నిర్మిస్తున్నాడు. తన తండ్రి మనోరంజన్ రాయ్ కోల్‌కతాలోని బౌబజార్ ప్రాంతంలో తనను హాస్టల్ ఉంచాడని, అక్కడ టైటానిక్‌ను పోలి ఉండే దుర్గాపూజ పండల్‌ని తనను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు.
అప్పటి నుంచి టైటానిక్ పోలి ఉండే సొంత ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నట్లు వివరించాడు. ఐతే ఈ ఇల్లు కోసం ఇంజనీర్లను సంప్రదిస్తే అందుకు వారు ముందుకు రాలేకపోయారని అన్నాడు. దీంతో తాను తన కలల ఇంటిని నిర్మించేందుకు నేపాల్ వెళ్లి తాపీ పని నేర్చుకున్నట్లు తెలిపాడు. ఆ తదనంతరం తన ఇంటిని నిర్మించేందుకు ఉపక్రమించాడు. అతను సామాన్య రైతు అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా తన డ్రీమ్ హౌస్ కోసం ఒక్కో ఇటుకను పేర్చుకుంటూ కట్టడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు తాను ఎంత డబ్బు ఖర్చు పెట్టింది లెక్కించలేదని, కానీ రూ.15 లక్షలకు తక్కువ ఉండకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు.
కాగా, మింటుకి ఇతిరాయ్ అనే ఆమెతో వివాహం అయ్యింది. వారికి కాలేజ్‌కి వెళ్లే కుమార్తె, పదోతరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడు. తాము చాలా పేదవాళ్లం అని కూతురు పుట్టిన తర్వాతే తమ జీవితాలు మారాయని చెప్పుకొచ్చాడు. తనకి తన అత్తగారి నుంచి కొంత భూమి వచ్చిందని, తేయాకు పండిస్తామని చెప్పాడు. అంతేగాదు తాను మరోవైపు ఆటో కూడా నడుపుతూ కొంత డబ్బు కూడబెట్టినట్లు తెలిపాడు. తాము అధికారికంగా హెలెంచ గ్రామ నివాసితులమని, 30 ఏళ్ల క్రితం ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఫన్‌సీదేవాకు తరలి వెళ్లినట్లు చెప్పాడు. మింటూ కుటుంబ సభ్యులంతా కలిసి ఈ ఇంటి నిర్మాణ పనుల్లో పాలుపంచుకుని, తన కలను సాకారం చేసుకునేందుకు సహకరిస్తున్నారని ఆనందంగా చెబుతున్నాడు.
వచ్చే రెండేళ్లలో ఈ ఇల్లు పూర్తి అయిపోతుందని, ఆ తర్వాత ఆ ఇంటి డెక్‌పై టీ దుకాణం పెడతానని చెప్పుకొచ్చాడు. ఓడ మాదిరిగానే ఈ ఇంటిలో కూడా మెట్ల నిర్మాణం ఉంటుందని మింటు వెల్లడించాడు. ఐతే ఈ ఇల్లుని చూసేందుకు పరిసరా ప్రాంత ప్రజలే గాక సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఫోటోలను తీసుకుని వెళ్తుంటే తనకెంతో సంతోషంగా అనిపిస్తుందని అంటున్నాడు మింటు.
(చదవండి: ఎంతపనైపాయే! వార్నింగ్ లైట్ వచ్చిందని విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment