భారత రక్షణ దళంలోని వాయుసేన విభాగం పటిష్టం చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. రక్షణ దళ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు తేలికపాటి యుద్ద విమానాలను కొనుగోలు చేయనుంది. ఇందులో భాగంగా మరో 97 తేజస్ యుద్ధ విమానాలను, 156 ప్రచండ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది.
ఈ రెండు రకాల విమానాలు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయనున్నారు. దేశీయ కంపెనీల నుంచి రూ.1.5 లక్షల కోట్ల విలువైన రక్షణ పరికరాల కొనుగోలు ప్రతిపాదనకు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. వీటి ఒప్పందాల విలువ సుమారు రూ. 1.1 లక్షల కోట్లు ఉండనుంది.
అదనంగా భారత వైమానిక దళం కోసం తేజస్ మార్క్ 1-ఏ యుద్ధ విమానాలు.. వైమానిక దళం, సైన్యం కోసం హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వీటి మొత్తం విలువ సుమారు రూ. 2 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రూపొందించనుంది. రాబోయే కొన్నేళ్లలో భారత వైమానిక దళంలో అమ్ముల పొదలో కొత్త యుద్ధ విమానాలు చేరనున్నాయి.
ఈ ప్రక్రియ పూర్తయితే.. భారత్ చరిత్రలోనే స్వదేశీ సంస్థ తయారుచేయనున్న అతిపెద్ద ఆర్డర్ కానుంది. ఇప్పుడే అనుమతి లభించిన నేపథ్యంలో విమానాలు రూపుదిద్దుకునే వరకు సమయం పట్టనుంది. అయితే విదేశీ తయారీదారులు భాగస్వామ్యం అయితే తక్కువ కాలంలో పూర్తిచేసే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment