
దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) చలి మరింత పెరిగింది. పొగమంచు కారణంగా విజిబులిటీ మరింత తగ్గింది. ఇటువంటి వాతావరణంలో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆదివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. శనివారం 5.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ.
మరోవైపు ఆదివారం ఉదయం 8.30 గంటలకు సఫ్దర్‌జంగ్‌లో 700 మీటర్ల విజిబిలిటీ లెవల్ మాత్రమే ఉంది. పాలెంలో ఇది 800 మీటర్లుగా ఉంది. ఆదివారం ఆకాశం నిర్మలంగా ఉంటుందని, కాస్త ఎండగా ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 24 నుండి 25 డిగ్రీలు మధ్య ఉండవచ్చు. వారమంతా ఇదే వాతావరణం కొనసాగనుంది. ఈ వారంలో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
ఇది కూడా చదవండి: ‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’