ఆదేశాలు వెనక్కి; వ్యాపారులకు ఊరట! | Delhi Government Withdraws Orders Shut 2 Markets Covid Safety Violations | Sakshi
Sakshi News home page

ఆ రెండు మార్కెట్ల మూసివేత: ఆదేశాలు వెనక్కి!

Published Mon, Nov 23 2020 11:22 AM | Last Updated on Mon, Nov 23 2020 12:53 PM

Delhi Government Withdraws Orders Shut 2 Markets Covid Safety Violations - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని పంజాబీ బస్తీ, జంటా మార్కెట్లను ఈనెలాఖరు వరకు మూసివేయాలన్న ఆదేశాలను ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేయడంతో చిరు వ్యాపారులకు భారీ ఊరట లభించింది. కాగా ఢిల్లీలో కరోనా వైరస్‌ థర్డ్‌వేవ్‌ మొదలైన నేపథ్యంలో కోవిడ్‌-19 నిబంధనలు కఠినతరం చేస్తూ కేజ్రీవాల్‌ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మాస్కు ధరించకపోతే 2 వేల రూపాయల జరిమానా, అదే విధంగా పెళ్లి తదితర శుభాకార్యాలకు 50 మంది అతిథులకు మాత్రమే అనుమతించింది.

ఇక మార్కెట్లు తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చినా, పూర్తిస్థాయిలో నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ క్రమంలో మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ పశ్చిమ ఢిల్లీలోని నంగ్లోయి ఏరియాలో  సాయంకాలపు మార్కెట్లు పంజాబీ బస్తీ, జంటా సముదాయంపై కొరడా ఝులిపించింది. నవంబరు 30 వరకు ఈ మార్కెట్లను మూసివేయాల్సిందిగా ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: కరోనా విజృంభణ; నైట్‌ కర్ఫ్యూ, సెక్షన్‌ 144 అమలు!)

ఈ క్రమంలో వెస్ట్‌ ఢిల్లీ అధికారులు, పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి షాపులు మూసివేసేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అయితే సుమారు 200 మంది వ్యాపారులు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తారని, ఈ మార్కెట్లను మూసివేయడం వల్ల తామంతా భారీగా నష్టపోవాల్సి ఉంటుందని నంగ్లోయి మార్కెట్‌, షుకర్‌ బజార్‌ మార్కెట్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ సుభాష్‌ బిందాల్‌ సహా పలువురు మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ఈ నేపథ్యంలో మరుసటి రోజే నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. కరోనా విజృంభన నేపథ్యంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలోనే ఈ మార్కెట్లను మూసివేయాల్సిందిగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement