
న్యూఢిల్లీ: ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 12వ తేదీ వరకు సెలవులను పొడిగించింది. ఢిల్లీలో పాఠశాలలకు సోమవారంతో శీతాకాల సెలవులు ముగియాల్సి ఉంది.
‘ఢిల్లీలో చలి వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లను మరో అయిదు రోజుల పాటు మూసి ఉంచాలని నిర్ణయించాం’అని విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం ‘ఎక్స్’లో తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తమ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించుకోవచ్చని తెలుపుతూ విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 6 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం ఉదయం 8 గంటలు–సాయంత్రం 5 గంటల మధ్యలోనే తరగతులు నడపాలని కోరింది.