న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలపై నిషేధం విధించాలన్న కేజ్రీవాల్ సర్కారు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ‘సూపర్ స్ప్రెడర్లు’ పుట్టుకువచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాజధాని నగరంలో నివసించే బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజ ప్రారంభం(నవంబరు 20) కానున్న నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం వేడుకల(నదీ తీరాలు, సరస్సుల వద్ద గుమిగూడటం)పై నిషేధం విధించింది. ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ మొదలైన కారణంగా సామూహిక సమావేశాల నిర్వహణకు అనుమతించేది లేదని ఢిల్లీ డిజాస్టర్ మేజ్‌మెంట్ అథారిటీ చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ఢిల్లీ లాక్‌డౌన్ : మనీష్ సిసోడియా స్పందన)
ఇదెలా సాధ్యం?
ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దుర్గా జన్ సేవా ట్రస్టు ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ఛత్ పూజ నేపథ్యంలో కనీసం వెయ్యి మందికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ‘‘ అవునా నిజంగానా? నేడు ఢిల్లీ ప్రభుత్వం వివాహ శుభాకార్యాలకు కేవలం 50 మందికే అనుమతి ఇస్తానని పేర్కొంది. మీరేమో వెయ్యి మందికి కావాలి అంటున్నారు. ఇదెలా సాధ్యపడుతుంది?’’అని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడింది. ‘‘కోవిడ్ ఇన్‌ఫెక్షన్ రేటు పెరిగిపోతోంది. 7800 నుంచి 8593 కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల రేటు కూడా రెట్టింపైంది. ప్రస్తుతం సుమారుగా 42 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. బహుశా వీటి గురించి అవగాహన లేదేమో’’అని ఢిల్లీ పరిస్థితుల గురించి పిటిషనర్‌కు వివరించింది.
నాలుగు రోజుల పండుగ
మొత్తం నాలుగు రోజులు ఛత్ వేడుకలు జరుపుకొంటారు. తొలి రోజు నాహాయ్-ఖాయ్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్త్రీ పురుషులు సూర్య భగవానుడిని అత్యంత నియమనిష్టలతో పూజిస్తారు. వ్రత ప్రక్రియ 72 గంటలలో పూర్తవుతుంది. రెండో రోజు ఖర్నా, మూడో రోజు డాలా ఛట్, నాలుగో రోజును పెహలా పేరిట పండుగ జరుపుకొంటారు. నాలుగో రోజు మోకాలిలోతు నీటిలో నిలబడి అస్తమించే సూర్యుడికి ఆరోగ్య ప్రసాదాలను, ఐదో రోజు ఉదయించే సూర్య భగవానుడికి ఆరోగ్య ప్రసాదాలను సమర్పిస్తారు. అనంతరం ఉపవాసాలు విరమించి బంధుమిత్రులతో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీ. యుమనా నది తీరంతోపాటు వివిధ కాలనీల్లో బహుళ అంతస్తుల టెర్రస్‌పై ఏర్పాటు చేసే కృత్రిమ చెరువులు ఈ పండుగకు వేదికలుగా మారతాయి.
Comments
Please login to add a commentAdd a comment