సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ జరుగనుంది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఈ నేపథ్యంలో ఈరోజైన కవిత బెయిల్ దొరుకుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో భాగంగా ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై ఇదే ధర్మాసనం గత శుక్రవారం విచారించి ఈడీ సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు సౌత్ గ్రూప్ తరఫున కవిత ఆప్ అగ్ర నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్న కారణంతో ఈడీ మార్చి 15న, సీబీఐ ఏప్రిల్ 11న ఆమెను అరెస్ట్ చేశాయి. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్ కోరుతూ కవిత చేసుకున్న దరఖాస్తులను రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కొట్టివేశారు. ఈ క్రమంలో ఈనెల 6న తీర్పునిచ్చారు.
ఈ మొత్తం కుంభకోణంలో ఈమెదే ప్రధానపాత్ర అని, బెయిలిస్తే సాక్ష్యాధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థలు చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్లను కొట్టివేశారు. దీంతో, రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment