ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో సీబీఐ ఆయన్ని కోరింది.
ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ తన సమన్లలో పేర్కొంది. ఈ కుంభకోణం మొత్తానికి కారణమైన.. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఈ స్కాంలో సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కేజ్రీవాల్ పేరు ఉంది కూడా.
‘‘జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న నేపథ్యంలోనే ఆప్‌పై ఒత్తిడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారు. పై నుంచి కిందిదాకా అవినీతిలో కూరుకుపోయింది మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి), మీ ప్రభుత్వమే. సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ తన పోరాటం ఆపరు. సీబీఐ ఎదుట హాజరవుతారు. అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన తన గళం వినిపించడం ఆపరు’’ అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment