న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వ్యాప్తి రోజురోజుకీ ఉధృతమవుతోంది. ఆదివారం ఒక్కరోజే అక్కడ 2,024 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత నెల రోజులుగా అక్కడ ఒక్కరోజులో నమోదైన కరోనా కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య లక్షా డెబ్పై మూడు వేలు దాటింది. ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీలో 22 మంది కోవిడ్‌తో మరణించగా.. కరోనా మృతుల సంఖ్య మొత్తంగా 4,426కు చేరుకుంది. (చదవండి: కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే..!)
ప్రపంచంలోనే తొలి దేశంగా
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో కొత్తగా 80, 092 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 80 వేలకు పైగా కరోనా కేసులు బయటపడిన తొలి దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు.. భారత్‌లో శనివారం భారీ స్థాయిలో పరీక్షలు జరిగాయి. ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా శాంపిళ్లను పరీక్షించారు. దీంతో దేశంలో మొత్తం పరీక్షల సంఖ్య 4.14 కోట్లు దాటింది.
అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచంలో 2.5 కోట్ల కోవిడ్ కేసులు బయటపడ్డాయి. అందులో అత్యధికంగా అమెరికాలో 59 లక్షల కేసులు, బ్రెజిల్‌లో 38 లక్షల కేసులు, భారత్‌లో 35 లక్షలకు పైగా కేసులు నమోదయ్యా యి. అమెరికా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుత కేసులకు 10 రెట్లు అధిక కేసులు ఉండవచ్చని చెబుతున్నారు. వారందరినీ గుర్తించి ఉండకపోవచ్చని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 8,42,000 మందికి పైగా మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment