సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సెషన్స్ కోర్టు ఏడు రోజులు కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో కస్టడీకి సంబంధించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో సంచలన విషయాలను వెల్లడించింది. కవిత అరెస్ట్ చట్టబద్దమే అని కోర్టు పేర్కొంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, ఢిల్లీలోరి రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం, ఈడీ కోరిక మేరకు కవితను ఏడు రోజుల పాటు కస్టడీ విధించింది కోర్టు. ఈ సందర్బంగా కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల్లో కోర్టు సంచలన విషయాలను వెల్లడించింది.
కోర్టు ఉత్తర్వుల ప్రకారం..‘కవిత అరెస్టు చట్టబద్ధమే. కవితను అరెస్టు చేయవద్దని ఎక్కడా సుప్రీంకోర్టు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వలేదు. తదుపరి విచారణ వరకు మాత్రమే సమన్లు ఇవ్వమని ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పింది. ఆ తర్వాత రెండుసార్లు ఈడీ సమన్లు ఇచ్చినప్పటికీ కవిత సుప్రీంకోర్టులో వాటిని ఛాలెంజ్ చేయలేదు. సుప్రీంకోర్టుకి ఇచ్చిన మాట తప్పారా? లేదా అన్నది మా పరిధిలో నిర్ణయించే అంశం కాదు. సెక్షన్-19 ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తూ అరెస్టు చేశారా? లేదా అన్నది మాత్రమే చూస్తాం.
కవితను చట్టబద్ధంగానే అరెస్టు చేశారు. మనీలాండరింగ్ చట్టం సెక్షన్-19 కింద అన్ని నిబంధనలను పాటించారు. ఈ నేరాల్లో కవిత కీలక పాత్ర పోషించారనేదానికి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఆమెను రిమాండ్ చేస్తూ దర్యాప్తు కోసం ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నాం. సీసీటీవీ కవరేజ్‌లో ఆమెను ఇంటరాగేషన్ చేయాలి. సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరచాలి. మహిళను విచారించే సమయంలో తీసుకోవలసిన అన్ని నిబంధనలు పాటించాలి.
ఆమె తరపు న్యాయవాదులు ప్రతీరోజు అరగంట పాటు కలవవచ్చు. ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ , బావ హరీష్ రావు, కజిన్ శ్రీధర్, ప్రణీత్ కుమార్, శరత్ కలుసుకునే అవకాశం ఉంది. అరెస్టు తరువాత హైబీపీకి గురైనట్లు ఈసీజీ రిపోర్టు ఉన్న నేపథ్యంలో తగిన మందులు ఇవ్వాలి. 24 గంటలకు ఒకసారి కవితకు వైద్య పరీక్షలు చేయాలి’ అని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment