న్యూఢిల్లీ: అనారోగ్యంతో వచ్చిన ఎస్సైను కొన్ని ఆస్పత్రులు చేర్చుకునేందుకు నిరాకరించాయి. మూడు ఆస్పత్రులు తిరిగినా చేర్చుకోకపోవడంతో ఆయన క్షణికావేశంలో అంబులెన్స్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన పోలీస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు ఆస్పత్రిలో ఆయనను ఎందుకు చేర్చుకోలేదు అనేది దర్యాప్తు చేస్తున్నారు.
ఢిల్లీలో రాజ్‌వీర్ సింగ్ (39) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ద్వారకలోని నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్న ఆయన ఐదు రోజులుగా సెలవులో ఉన్నారు. ఇక శుక్రవారం అనారోగ్యం చెందడంతో అంబులెన్స్‌ను ఇంటికి పిలిపించారు. ఆ వెంటనే అంబులెన్స్ సమీపంలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా ఆయనను చేర్చుకునేందుకు నిరాకరించింది. ఆ తర్వాత మరో ఆస్పత్రికి వెళ్లగా అదే సమాధానం వచ్చింది. చివరకు మూడో ఆస్పత్రికి కూడా వెళ్లగా వాళ్లు ‘చేర్చుకోం’ అనడంతో అనారోగ్యంతో బాధలో ఉన్న రాజ్‌వీర్ సింగ్ అంబులెన్స్‌లో ఉన్న ఓ వస్త్రంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతుడికి తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఈ ఘటనపై చర్యలు తీసుకుంటున్నట్లు డీసీపీ మీనా తెలిపారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఆస్పత్రులు ఆయనను ఎందుకు చేర్చుకునేందుకు నిరాకరించాయనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ మీడియాతో చెప్పారు. అయితే కరోనా భయంతోనే ఆస్పత్రులు అతడిని చేర్చుకునేందుకు నిరాకరించాయని తెలుస్తోంది. సకాలంలో చేర్చుకుని ఉంటే ఆయన ప్రాణం దక్కేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment