
సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా..
ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ అమానుష ఘటనపై అధికారులు సైతం దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు.. విచారణలో ప్రత్యక్ష సాక్షి చెబుతున్న విషయాలను విని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అలానే సీసీఫుటేజ్ దృశ్యాలు సైతం నివ్వెరపోయేలా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ మేరకు ఈ ఘటననే చూసిన ప్రత్యక్ష సాక్షి దీపక్ దహియా మాట్లాడుతూ...ఈ ఘటన తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగినట్లు తెలిపాడు. అతను తన మిఠాయి షాపు వద్ద ఉండగా.. సుమారు వంద మీటర్ల దూరంలో పెద్ద శబ్దం వచ్చింది. కారు టైరు పేలిందనుకున్నా.. కానీ కారు కదిలినప్పుడూ ఒక మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాను. తాను పెద్దగా అరుస్తూ వాహనాన్ని ఆపేందుకు మోటారు బైక్‌తో వెంబడించి యత్నించాను కానీ వారు వాహనాన్ని ఆపలేదు. సుమారు గంటన్నరపాటు ఆ యువతి మృతదేహాన్ని 20 కి.మీ దూరం ఈడ్చుకెళ్లారని తెలిపాడు.
వారు యూటర్న్ తీసుకుని పదే పదే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లిపోయినట్లు వెల్లడించాడు. ఇది కేవలం ప్రమాదం కాదని దహియా నొక్కి చెప్పాడు. అంతేగాదు సుమారు గంటన్నర తర్వాత, కంఝవాలా రోడ్డులోని జ్యోతి గ్రామ సమీపంలో కారు నుంచి మృతదేహం వేరయ్యిందని, ఆ తర్వాత నిందితులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పాడు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు హరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ...కారు ఢీ కొట్టడంతో యువతి స్కూటీ నుంచి పడిపోయిందని, ఆ తర్వాత చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు తెలిపారు.
వాహనం రిజిస్టర్ నెంబర్ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే వాహనం కిటికీలు మూసి ఉన్నాయి, పైగా సంగీతం బిగ్గరగా వస్తున్నందున్న తమకు ఏం జరిగిందో తెలియలేదని నిందితులు చెబుతున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి పరారయ్యినట్లు పోలీసులకు తెలిపారు. ఆ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
🔴#BREAKING | New CCTV Confirms Witness Account, Car Makes U-Turn, Drags Delhi Woman https://t.co/wPFfrz6eKV pic.twitter.com/DvUDIbbwfM
— Breaking News (@feeds24x7) January 2, 2023
(చదవండి: ఢిల్లీ ఘటనపై గవర్నర్ సక్సేనా ఫైర్: సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది)