
అయోధ్యలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులు.. ఇకపై చంద్రుని చల్లని వెన్నెలలోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగనుంది.
అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. అలాగే మంగళ, శయన హారతులను కూడా ప్రారంభించనున్నారు.
రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉంటోంది. రాత్రివేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్టు యోచిస్తోంది. దీంతో భక్తులు చల్లని వెన్నెలలోనూ బాలరాముడిని దర్శించుకోగలుగుతారు.
సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఏకాదశితో పాటు పండుగ రోజులలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజుకు లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment