కాంగ్రెస్‌లో ‘అయోధ్య’ చిచ్చు..! | Dissent Rising In Congress Over Ayodhya As Gujarat MLA Resigned | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అయోధ్య చిచ్చు.. రోజు రోజుకు పెరుగుతున్న అసమ్మతి

Published Sat, Jan 20 2024 11:05 AM | Last Updated on Sat, Jan 20 2024 11:37 AM

Dissent Rising In Congress Over Ayodhya As Gujarat Mla Resigned  - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర అంశం పార్లమెంట్‌ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 22న జరిగే రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దూరంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సొంత పార్టీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గుజరాత్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీజే చావ్డా రామ మందిరంపై పార్టీ వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్‌కు తన రాజీనామాను కూడా సమర్పించడం సంచలనం రేపింది. చావ్డా రాజీనామాతో గుజరాత్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం కేవలం 15కు పడిపోయింది. మూడుసార్లు కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా ఎన్నికల్లో బీజేపీ హవాను సైతం తట్టుకొని నిలబడ్డారు.

రాజీనామా సందర్భంగా చావ్డా మాట్లాడుతూ ‘నేనెప్పుడూ అధికార పార్టీ విధానాల్లో లోపాలను ఎత్తి చూపడాన్ని బలంగా నమ్ముతాను. ఈ మధ్య కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని నరేంద్రమోదీని అనవసరంగా టార్గెట్‌ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజారంజకంగా ఉన్నాయి’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో చావ్డా త్వరలో బీజేపీలో చేరతారనే పుకార్లు జోరందుకున్నాయి.

ఇక గుజరాత్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌​ ప్రెసిడెంట్‌​ అంబరీశ్‌ దేర్‌ రామందిరంపై పార్టీ నిర్ణయాన్ని ఇటీవల ఎక్స్‌(ట్విటర్‌)లో తప్పుపట్టారు. ఈయనతో  పాటు పోర్‌బందర్‌ ఎమ్మెల్యే గుజరాత్‌ పీసీసీ మాజీ చీఫ్‌ అర్జున్‌ మోత్వాడా కూడా రామమందిరంపై పార్టీ వైఖరిని బహిరంగంగానే విమర్శించారు. రాముని ప్రతిష్టాపన వేడుకకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని పార్టీ తీసుకోకుండా ఉండాల్సిందని అన్నారు.

కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ప్రమోద్‌ కృష్ణన్‌ అయితే ఒక అడుగు ముందుకు వేసి అయోధ్య రామ మందిర వేడుకపై కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం పార్టీకి ఆత్మహత్యా సదృశమని సంచలన వ్యా‍ఖ్యలు చేశారు. మొత్తంగా అయోధ్య రాముని గుడి ప్రారంభోత్సవం లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీని డిఫెన్స్‌లో పడేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

ఇదీచదవండి.. అయోధ్యకు యూపీ ప్రభుత్వ విరాళమెంత       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement