దీపావళి.. దివ్యకాంతుల మధ్య జరుపుకునే ఆనందాల పండుగ. మన దేశంలోని అందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ దీపావళి. దేశంలోని వివిధ ప్రాంతాలలో దీపావళికి ప్రత్యేక సంప్రదాయాలనున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను భావిస్తారు. అయోధ్యలో ఈ ఏడాది దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే పలు ప్రధాన నగరాల్లోనూ దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.
అయోధ్య
ఈ ఏడాది ప్రపంచమంతా అయోధ్యలో జరిగే దీపావళి వేడుకలను చూసేందుకు పరితపిస్తోంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం. 500 ఏళ్ల తరువాత శ్రీరాముడు ఇక్కడ ప్రతిష్టితుడయ్యాడు. రామాయణంలోని వివరాల ప్రకారం శ్రీరాముడు రావణాసురుడిని ఓడించి 14 సంవత్సరాల అజ్ఞాతవాసం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. ఈ సందర్భంగా దీపావళి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళికి అయోధ్యలో 28 లక్షల దీపాలు వెలిగించి, ప్రపంచ రికార్డు నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వారణాసి
కాశీ అని కూడా పిలిచే వారణాసి భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని. ప్రపంచంలోని పురాతన నగరాలలో వారణాసి ఒకటి. ఇక్కడి గాలిలో ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంటుంది. ప్రతి సంవత్సరం దీపావళికి లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలివస్తుంటారు. ఇక్కడ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి.
ఉదయపూర్
రాజస్థాన్‌లోని ఉదయపూర్ నగరం సరస్సుల నగరంగా పేరొందింది. ఇక్కడ కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. నగరంలోని వీధులను రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు. సరస్సుల ఒడ్డున ఉన్న ప్యాలెస్‌లు విద్యుత్ దీపకాంతులతో వెలుగొందుతుంటాయి. ఉదయపూర్‌లోని పలు ప్రాంతాల్లో బాణసంచా కాల్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
అమృత్‌సర్
అమృత్‌సర్‌లో దీపావళి వేడుకలు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. స్వర్ణ దేవాలయంలో దీపావళి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీపావళి నాడు గ్వాలియర్ కోట నుండి ఆరవ సిక్కు గురువుతో పాటు 52 మంది ఇతర ఖైదీలను విడుదల చేసిన రోజును సిక్కు సోదరులు గుర్తు చేసుకుంటారు. గోల్డెన్ టెంపుల్ కూడా బంగారు దీపాలతో ప్రకాశవంతంగా మారిపోతుంది.
కోల్‌కతా
పశ్చిమబెంగాల్‌లో దీపావళి నాడు కాళీ పూజలు నిర్వహిస్తారు. అమావాస్య రాత్రివేళ కాళీ పూజలు చేస్తారు. దీంతో దీపావళి రాత్రి వేళ నగరం దీపకాంతులతో శోభాయమానంగా మారిపోతుంది.
ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో దీపావళి వెలుగులు
Comments
Please login to add a commentAdd a comment