సాక్షి, చెన్నై: ప్రపంచ నలుమూలలా.. ఉన్న తమిళుల రక్షణే డీఎంకే ప్రథమ కర్తవ్యం అని.. ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఊళ్లో ఉన్నా.. ఉక్రెయిన్‌లో ఉన్నా.. రక్షిస్తామని స్పష్టం చేశారు. ఇక, ఏప్రిల్ రెండో తేదీ ఢిల్లీకి సీఎం స్టాలిన్ పయనం కానున్నారు. డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో నాద స్వరచక్రవర్తి టీఎన్ రాజరత్నం కుటుంబ వివాహ వేడుక జరిగింది. వధూవరులు కావ్య, కరుణారత్నంను ఆశీర్వదించిన అనంతరం.. సీఎం స్టాలిన్ ప్రసంగించారు. తమిళం అన్న పదం విన్నా, పలికినా, తెలియని ఉద్వేగం ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుందన్నారు. తమిళులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, వారికి చిన్న పాటి ఆపద ఎదురైనా తొలుత స్పందించి పరుగులు తీసే పార్టీ తమదేనని పేర్కొన్నారు. ప్రపంచం నలు మూలల్లో ఉన్న తమిళులకు రక్షకులుగా డీఎంకే ఉందని భరోసా ఇచ్చారు.
ఉక్రెయిన్‌లో ఉన్న 2 వేల మంది తమిళుల్ని ఇక్కడికి రప్పించేందుకు తాము ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఏ రాష్ట్రం కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదన్నారు. ఈ కమిటీ సభ్యులు ఢిల్లీలోనే ఉంటూ.. రేయింబవళ్లు శ్రమించి తమిళ విద్యార్థులను రాష్ట్రానికి రప్పించారన్నారు. కార్యక్రమంలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్, సీనియర్ నేతలు, మంత్రులు పొన్ముడి, వేలు, ఎంపీలు రాజ, జగత్ రక్షకన్, టీకేఎస్ ఇలంగోవన్ తదితరులు పాల్గొన్నారు.
బిల్డర్ల కాన్ఫరెన్స్‌కు సీఎం..
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మూడు రోజుల కాన్ఫరెన్స్ చెన్నైలో శనివారం రాత్రి నుంచి నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి భవన నిర్మాణ రంగంలోని 1,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరితో సీఎం స్టాలిన్ భేటీ అయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి సావనీరును ఆవిష్కరించారు. నిర్మాణరంVýæం, ఆర్థిక వ్యవస్థల బలోపేతంపై సీఎంకు బిల్డర్స్ పలు విజ్ఞప్తులు చేశారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్‌ఎన్ గుప్తా, చైర్మన్ భీష్మ ఆర్. రాధాకృష్ణన్, తమిళనాడు చైర్మన్ శివకుమార్, మంత్రి దురై మురుగన్, వేలు, అన్బరసన్ తదితరులు పాల్గొన్నారు.
అన్నా అరివాలయం ప్రారంభోత్సవానికి..
ఏప్రిల్ 2న సీఎం స్టాలిన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఇది రాజకీయ పయనం అన్న ప్రకటనతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీల్లో డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కార్యాలయాన్ని ఏప్రిల్ 2న ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఈ దృష్ట్యా ఢిల్లీకి స్టాలిన్ వెళ్లనున్నారు. అయితే, ఈ ప్రారం భోత్సవానికి మమత బెనర్జీ, కె చంద్రశేఖర్‌రావు, ఉమర్ అబ్దుల్లా, ఉద్దవ్ థాకరే ‡ వంటి నేతలను ఆహ్వానించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే, ఏఐసీసీ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ను కూడా ఆహ్వానించబోతున్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment