సాక్షి, చెన్నై(తమిళనాడు): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం ప్రముఖ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ రేల తన సేవల్ని అందిస్తున్నారని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ తెలిపారు. రేల హాస్పిటల్‌లో 4 ఏళ్ల బాలుడికి జరిగిన చిన్న పేగు మార్పిడి శస్త్ర చికిత్స ఏసియా బుక్ ఆఫ్‌లో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బెంగళూరుకు చెందిన స్వామినాథన్ కుమారుడు గుహన్(4)కు కొన్ని నెలల క్రితం ఆరోగ్య పరంగాఎదురైన సమస్యలతో చెన్నైలోని రేల ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
ఆ బాలుడికి చిన్న పేగు పూర్తిగా కుళ్లి పోవడంతో అవయవ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యం అయింది. ఆ బాలుడి తండ్రి పేగులో కొంతభాగం సేకరించి శస్త్ర చికిత్సను విజయవంతం చేశారు. ఈ శస్త్ర చికిత్స ఏసియా బుక్‌లో చోటు దక్కించుకుంది. ఇందుకు తగ్గ ప్రశంసాపత్రం, పతకం ప్రదాన కార్యక్రమం మంగళవారం చెన్నై గిండిలో జరిగింది. ఈసందర్భంగా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జనని అనే పేద బాలిక ప్రాణాల్ని రక్షించేందుకు డాక్టర్ రేల బృందం తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించారు.
ప్రైవేటు రంగంలోకి ఉన్న డాక్టర్ రేల తన సేవల్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సైతం ఉచితంగా అందించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్ మహ్మద్ రేల, డాక్టర్ నరేష్ షణ్ముగం బృందంతో పాటుగా ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్, ఏసియా బుక్ ప్రతినిధి వివేక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment