
మలప్పురం: ఆయుర్వేదంలో గురుతుల్యుడు, కొట్టక్కల్ ఆర్య వైద్యశాల(కేఏఎస్) మేనేజింగ్ ట్రస్టీ అయిన డాక్టర్ పి.కె.వారియర్ కన్నుమూశారు. జూన్ 8వ తేదీన వందో జన్మదిన వేడుకలు జరుపుకున్న వారియర్ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీధరన్ నంబూద్రి, పన్నియంపిల్లి కున్హి వారియర్ దంపతులకు 1921 జూన్ 5వ తేదీన జన్మించిన పన్నియంపిల్లి కృష్ణకుట్టి వారియర్(పీకే వారియర్) విద్యాభ్యాసం కొట్టక్కల్‌లోని సాగింది. 20 ఏళ్ల వయస్సులో ఆయన కేఏఎస్‌లో చేరారు. దేశ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితుడైన ఆయన..ఆయుర్వేద అధ్యయనానికి స్వస్తి చెప్పి పోరాటబాట పట్టారు. అయితే, క్రియాశీల రాజకీయాలు తనకు సరిపోవని గ్రహించి అనంతరం ఆయుర్వేదం అధ్యయనానికే అంకితమయ్యారు. చదువు పూర్తయ్యాక 24 ఏళ్ల వయస్సులో కేఏఎస్ ట్రస్టీగా చేరారు.
119 ఏళ్ల కేఏఎస్ ట్రస్ట్‌ను ఆరు దశాబ్దాలపాటు నడిపి, అత్యుత్తమ సంస్థగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన మార్గదర్శకత్వంలో కొట్టక్కల్‌లోని ఆర్య వైద్యశాల, ఆయుర్వేద మెడికల్ కాలేజీ బాధ్యతలను చేపట్టాక ఎంతో అభివృద్ధి చెందడంతోపాటు శాస్త్రీయ, ప్రామాణిక ఆయుర్వేద వైద్య చికిత్స, విధానాలకు మారుపేరుగా మారాయి. జీవిత కాలంలో ఆయన దేశ, విదేశాలకు చెందిన పలువురు మాజీ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు సహా ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి చికిత్స అందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1999లో పద్మశ్రీ, 2010లో పద్మభూషణ్‌తో గౌరవించింది.
ఆయన మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, డాక్టర్ వారియర్ మృతిపట్ల కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, సీఎం పినరయి విజయన్ తదితరులు సంతాపం ప్రకటించారు. ‘డాక్టర్ పీకే వారియర్ మృతి విచారకరం. ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన చేసిన కృషిని ఎన్నటికీ గుర్తుండిపోతాయి. ఆయన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’అని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.