న్యూఢిల్లీ: అత్యున్నత పీఠంపై గిరి పుత్రిక కొలువుదీరడానికి సమయం ఆసన్నమయ్యింది. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ముర్ముతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
ప్రమాణ స్వీకారం అనంతరం ముర్ముకు సైనిక సిబ్బంది 21 గన్ సెల్యూట్ సమర్పిస్తారని తెలిపింది. తర్వాత ఆమె ప్రసంగం ఉంటుందని పేర్కొంది. అంతకంటే ముందు రామ్‌నాథ్ కోవింద్, ముర్ము కలిసి పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌కు చేరుకుంటారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రి మంత్రులు, దౌత్యవేత్తలు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సైనికాధిరులు పాల్గొంటారని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment