Bihar: Drunk JDU Leader Arrested After Naked Show Viral - Sakshi
Sakshi News home page

Bihar JDU Leader: ఆపరేషన్ దుర్యోధన సీన్‌‌! ఒంటి మీద నూలుపోగు లేకుండా..

Published Thu, Feb 24 2022 8:09 PM | Last Updated on Fri, Feb 25 2022 10:44 AM

Drunk Bihar JDU Leader Arrested After Naked Show Viral - Sakshi

పోసాని డైరెక్షన్‌లో వచ్చిన పొలిటికల్‌ డ్రామా ‘ఆపరేషన్‌ దుర్యోధన’ గుర్తుంది కదా. ఎంత మంది చూశారో తెలియదుగానీ.. అందులో హీరో ఇంట్రో సీనే సినిమాకు హైలెట్‌గా నిలిచింది. సినిమా మీద ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. ఒంటి మీద నూలు పోగులేకుండా భగవంతుడు(శ్రీకాంత్‌ క్యారెక్టర్‌) నగ్నంగా రోడ్ల మీద తిరుగుతుంటుంది. అది చూసి షాక్‌ తిన్న పోలీసులు.. బ్యానర్‌ కట్టి పక్కకు తీసుకెళ్తారు. దాదాపుగా ఇలాంటి సీనే ఒకటి రియల్‌ లైఫ్‌లో జరిగింది. 

నగ్నంగా రోడ్ల మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఓ పోల్‌కి ఉన్న బ్యానర్లు కట్టి పక్కకు తీసుకెళ్లారు. తీరా అదుపులోకి తీసుకున్నాక అతనొక రాజకీయ నేత అని, పైగా అధికార పక్షానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కంగుతిన్నారు. పార్టీ దృష్టిలో పడేందుకే తాను అలా సమాధానం ఇవ్వడంతో  బిత్తరపోయారు. బీహార్‌ నలంద జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.   

ఇస్లాంపూర్‌ నియోజకవర్గ  జేడీయూ యూత్‌ వింగ్‌ లీడర్‌ జయ్‌ ప్రకాశ్‌ అలియాస్‌ కరూ.. నగ్నంగా రోడ్ల మీద హల్‌ చల్‌ చేశాడు. సొంత గ్రామం జగదీష్‌పూర్‌లో ఫుల్‌గా మద్యం సేవించి.. ఒంటి మీద దుస్తులు విప్పదీసి రోడ్డెక్కాడు. ఆపై అక్కడే ఉన్న ఓ లోకల్‌ లీడర్‌ ఇంటికెళ్లి.. అతని కాళ్ల దగ్గర కూర్చున్నాడు. తన గురించి పట్టించుకోవాలని, పార్టీ కోసం గొడ్డులా కష్టపడుతున్నానంటూ బతిమాలుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడో అని భయపడి ఆ లీడర్‌ గప్‌చుప్‌గా ఉండిపోయాడు.

కాసేపటికి కరూ సోదరుడు వచ్చి.. అతన్ని బయటకు లాక్కెళ్లాడు. లిక్కర్‌ ప్రొబిహిషన్‌ ఉండడంతో ఇంట్లోనే ఉండాలంటూ బతిమాలుకున్నాడు. కానీ, మాట వినని కరూ.. ‘నన్నెవరూ ఏం పీకలేరంటూ’ తెగ వాగుతూ మళ్లీ రోడ్డెక్కి వీరంగం వేశాడు. ఈ నిరసనతో అయినా పార్టీ తనని గుర్తించాలంటూ కేకలు వేశాడు. అదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డు చేశారు. ఆ వీడియో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో అప్పటికప్పుడే వైరల్‌ కావడం.. నిమిషాల వ్యవధిలో పోలీసుల దృష్టికి వెళ్లడం.. ఆపై కరూ కటకటాల వెనక్కి వెళ్లడం బుల్లెట్‌ స్పీడ్‌తో జరిగిపోయాయి. లిక్కర్‌ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ కింద అతన్నిఅరెస్ట్‌ చేసినట్లు ఇస్లాంపూర్‌ పోలీసులు వెల్లడించారు. కరూ కోరుకున్నట్లే అధిష్టానం దృష్టిలో పడ్డాడు. కానీ, ఫలితం మరోలా ఉంది.  పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఇస్లాంపూర్‌ జేడీయూ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ తన్వీర్‌ అలం ప్రకటించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement