లక్నో: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తాగిన మైకంలో కారును రోడ్డు పక్కన పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి పోనిచ్చాడు. ఈ ఘటనలో ఆరేళ్ల చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నోయిడా సెక్టర్ 45లోని సదర్‌పూర్ గ్రామంలో శనివారం జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రియా(6), అను(15), అంకిత(18) అనే ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరీ(గోల్‌గప్పా) తినేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న బండి వద్ద తింటుండగా.. అదే సమయంలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలవ్వగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరేళ్ల రియా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు పోలీసు అధికారి రాజీవ్ బల్యాన్ తెలిపారు. మరో బాలిక అను వెన్నుముకకు గాయాలు అవ్వగా, అంకితకు చిన్న గాయాలైనట్లు పేర్కొన్నారు.
అయితే బాధితురాలి తల్లి పక్కన నిల్చున్నందున తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మద్యం సేవించి అతివేంగా కారు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కారు ఢీకొట్టడంతో గప్‌చుప్ బండి బోల్తా పడినట్లు చెప్పారు. అలాగే పక్కనే ఉన్న ఇటుకల గోడ కూడా పడిపోయినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో గుమిగూడిన జనం డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారుని సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment