సాక్షి, చెన్నై: తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు. దీంతో, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. చెన్నై విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అయ్యే సమయానికి ఫ్లైట్ వింగ్స్ భాగం నుంచి పొగ రావడం కనిపించింది. దీంతో, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అక్కడే నిలిపివేశారు.
ఈ క్రమంలో అలర్ట్ అయిన విమాన సిబ్బంది, టెక్నికల్ టీమ్ విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు. పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్టు అధికారులు తెలిపారు. అయితే, పొగ రావడానికి గల కారణాలను సిబ్బంది వెల్లడించలేదు. దీంతో, ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ఇక, రాత్రి 9:15 గంటలకు దుబాయ్ వెళ్లాల్సిన విమానం నాలుగు గంటలు ఆలస్యంగా అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత టేకాఫ్ అయినట్టు సమాచారం. ఇక, ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 320 మంది ప్రయాణీకులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment