వెబ్‌డెస్క్: కోవిడ్ మహమ్మారి బాల్యాన్ని కాటేస్తోంది. పిల్లలను పాఠశాలకు దూరం చేసి కర్మాగారాలకు దగ్గర చేస్తోంది. గడిచిన ఇరవై ఏళ్లుగా బాల కార్మికుల విషయంలో కనిపిస్తున్న వృద్ధి కరోనా దెబ్బకు కకావికలమైంది. మరోసారి రికార్డు స్థాయిలో బాల కార్మికుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు ఐక్యరాజ్య సమితి ప్రతీ ఏడు జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
బాలలపై కోరలు చాచిన కరోనా
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు లాక్‌డౌన్ అనివార్యంగా మారింది. దీంతో పాఠశాలలు మూత పడ్డాయి. రోజువారి పని చేసుకునే కూలీలకు ఉపాధి కరువైంది. ఫలితంగా వర్థమాన, పేద దేశాల్లోని పిల్లలు భారీ ఎత్తున పాఠశాలకు దూరమవుతున్నారు. ఆర్థిక పరిస్థితి దిగజారిన కుటుంబాలకు అండగా ఉండేందుకు బాల కార్మిక వ్యవస్థలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. తాజా గణాంకాలు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నాయి.
20 ఏళ్ల తర్వాత తొలిసారి
ఐక్యరాజ్య సమితి చైల్డ్ లేబర్ గ్లోబల్ ఎస్టిమేట్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్లమంది బాల కార్మికులు ఉన్నట్లుగా తేల్చింది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన చర్యల కారణంగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. 20 ఏళ్ల పాటు తగ్గుముఖం పడుతూ వచ్చిన బాల కార్మికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) తెలిపింది. 2001 నుంచి 2016 వరకు అన్ని దేశాల్లో కలిపి 9.4 కోట్ల మంది బాలకార్మికులు ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.
మరింత మంది
కేవలం కోవిడ్ కారణంగా 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా మరో 90 లక్షల మంది పిల్లలకు బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని యూఎన్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందులో 46 లక్షల మంది బాలలు అనాథలుగా మారడమో లేదా సామాజిక భద్రతకు దూరమవుతారని తెలిపింది.
పదివేల మందికి పైగా
2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో 5 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న వారి సంఖ్య 25.6 కోట్లుగా ఉంది. ఇందులో నాలుగో వంతు మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో మగ్గిపోతున్నారు.
సామాజిక భద్రత
ఇక కరోనా కారణంగా 2021 మే 31 వరకు దేశ వ్యాప్తంగా పది వేల మంది పిల్లలు అనాథలుగా మారినట్ట్టు కేంద్ర ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీరందరికీ సామాజిక భద్రత ఇప్పుడు ఎంతో అవసరం. ఈ పిల్లలను ఆదుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మొదటగా ముందుకు వచ్చారు. పిల్లల పేరిట రూ. 10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు సైతం ఇదే తరహా పథకాలను ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment