న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడుతోంది. దేశ చరిత్రలోనే తొలిసారి రికార్టు స్థాయిలో అక్రమంగా తరలిస్తున్న సొమ్ము అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మార్చి 1 నుంచి వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.4,658 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ 45 రోజుల్లో కోట్ల నగదుతోపాటు డ్రగ్స్, ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు పేర్కొంది.
మొత్తం సొత్తులో రూ.395.39 కోట్ల నగదు, రూ.489.31 కోట్ల విలువైన మద్యం, రూ.2,068.85 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు, రూ.562.10 కోట్ల విలువైన లోహాలు, ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన రూ.1,142.49 కోట్ల విలువైన కానుకలు ఉన్నట్లు తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని ప్రకటించింది. మార్చి 1 నుంచి ఇప్పటివరకు రోజుకు సగటున రూ.100 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
ఇప్పటి వరకుసీజ్ అయిన రూ.778 కోట్లతో రాజస్థాన్ తొలి స్థానంలో ఉండగా.. అత్యల్పంగా లద్ధాఖ్‌లో రూ.11,580 మాత్రమే పట్టుబడింది. 2019 ఎన్నికల సమయంలో రూ.3,475 కోట్ల సొత్తు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పుడు మార్చి 1 నుంచి ఏప్రిల్ 13 మధ్యకాలంలోనే గత ఎన్నికల కంటే 33.85% ఎక్కువ సొత్తు చేజిక్కించుకున్నట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment