ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఐదోసారి సమన్లు పంపినా.. విచారణకు గైర్హాజరయ్యారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్. దీంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) కోర్టులో ఫిర్యాదు చేసింది.
లిక్కర్ స్కామ్‌లో విచారణకు డుమ్మా కొడుతున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌పై శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. పీఎంఎల్( Prevention of Money Laundering Act)లోని సెక్షన్ 63(4) ప్రకారం ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఐపీసీలోని సెక్షన్ 174ను సైతం(పబ్లిక్ సర్వెంట్ ఎదుట గైర్హాజరు కావడం) ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం ఈ కేసును కోర్టు విచారణ జరపనుంది.
తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి ఆయన విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్‌కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2..) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు అరెస్టయిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment