కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు | ED Focus On MLC Kavitha Relative Meka Sharan Involved Delhi Liquor Case, Details Inside - Sakshi
Sakshi News home page

ఈడీ రిమాండ్‌ రిపోర్టు: కవిత మేనల్లుడి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు

Published Sat, Mar 23 2024 2:48 PM | Last Updated on Sat, Mar 23 2024 4:55 PM

ED Focus On Meka Sharan kavitha involved Delhi Liquor Case - Sakshi

ఢిల్లీ: దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతనెవరో కాదు.. ఇప్పటికే అరెస్ట్‌ అయి ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అత్యంత దగ్గరి బంధువు మేకా శరణ్‌. కవిత ఇంట్లో జరిగిన సోదాల్లో శరణ్‌ ఫోన్‌ లభ్యం అయింది. దీంతో సౌత్‌ గ్రూప్‌ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత మేనల్లుడు మేకా శరణ్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మేకా శరణ్‌ను ప్రశ్నించేందుకు పిలిస్తే రావడం లేదని ఈడీ చెబుతోంది. ఏడు రోజుల కవిత విచారణకు సంబంధించి పలు కీలక వివరాలను రిమాండ్ పిటిషన్‌లో వెల్లడించింది. ‘ఏడు రోజుల రిమాండ్‌లో కవిత.. నాలుగు స్టేట్మెంట్లపై ప్రధానంగా ప్రశ్నించాం. ఫోన్‌లోని డేటా ఎందుకు డిలీట్ చేశారని అడిగాము. ఆదాయపు పన్ను వివరాలు, బంధువుల వ్యాపారాల వివరాలు అడిగాం. మేకా శరన్ వివరాలు అడిగితే ‘నాకు తెలియదు’అని కవిత చెప్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ కేసులో సంపాదించిన అక్రమ సొమ్మును కవిత బంధువు మేక శరణ్ బదిలీ చేశారు. ఇండోస్పిరిట్ ద్వారా ఈ అక్రమ సొమ్ము సంపాదించారు.  కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, సమీర్ మహేంద్ర కలిసి కుట్రపన్ని ఇండో స్పిరిట్ ద్వారా అక్రమ సొమ్ము లావాదేవీలు చేశారు. మేకా శరన్ ఈడీ ముందు హాజరు కావాలని ఫోన్ చేస్తే సహకరించడం లేదు. అందుకే ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి.

ఈ విషయంలో సమీర్ మహేంద్రను కూడా ఇంటరాగేషన్ చేయబోతున్నాం. మేకా శరణ్‌కు అక్రమ సొమ్ము ఎలా బదిలీ చేశారు, వినియోగించారు అనేది తెలుసుకోవాలి. కొత్తగా వెలుగు చూస్తున్న ఈ విషయాల నేపథ్యంలో కవితను మరింత విచారణ చేయాలి’ అని ఈడీ రిమాండ్‌ పిటిషన్‌లోని కీలక విషయాలు వెల్లడించింది.
చదవండి: అక్రమ అరెస్ట్‌లపై కోర్టులో పోరాడుతా: కల్వకుంట్ల కవిత

కవిత మేనల్లుడు మేక శరణ్ నివాసంలో ఈడీ సోదాలు
కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ద్వారా లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానం వ్యక్త చేస్తోంది. మేకా శరణ్ నివాసంలో  ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మేకా శరణ్ అందుబాటులో లేరు. ముడుపుల చెల్లింపులో శరణ్‌దే కీలక పాత్రగా ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు.. తనను బెయిల్‌ ఇవ్వాలని సెషన్స్‌ కోర్టు కవిత పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ( శనివారం) రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. వాదనలను విన్న కోర్టు.. కవితకు మరో మూడు రోజుల ఈడీ కస్టడీని పొడగించింది. ఈ నెల 26 వరకు ఈడీ కస్టడీ పొడగిస్తూ.. 26 తేదీ ఉదయం 11.30 గంటలకు కవితను కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది.

కవిత తరపు న్యాయవాది వాదనలు.. 
‘ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్స్ ఎలా ఇస్తారు?. కవిత పిల్లలు మైనర్స్‌.. వారిని కలిసేందుకు అవకాశం ఇవ్వండి.  కస్టడీ పూర్తైన రోజే కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపండి. కవితకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతున్నాం. బెయిల్‌ పిటిషన్‌ వేశాం. బెయిల్‌ పిటిషన్స్‌పై ఈడీకి ఆదేశాలు ఇవ్వండి’ అని కోర్టును కోరారు. 

అనంతరం ఈడీ తరపు న్యాయవాది జోయాబ్ హుసేన్‌ వాదనలు వినిపించారు. ‘కవిత ఈడీ విచారణకు సహకరించడం లేదు.మరో ఐదు రోజుల కస్టడీ కావాలి. నలుగురు స్టేట్మెంట్స్‌ గురించి కవితని అడిగాం. కిక్ బ్యాగ్స్ గురించి అడిగాం. ఫోన్ల డేటా డిలీట్ చేశారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగాం. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదు. మేకా శరణ్‌కి సంబంధించి సమాచారం ఇవ్వడం లేదు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీనే. కవితతో కలిపి సమీర్‌ను విచారించాలి. లిక్కర్‌ స్కాంలో రూ. వందల కోట్లు చేతులు మారాయి.  ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయి.  కవితకు వైద్య సూచనల మేరకు మందులు, డైట్‌ ఇస్తున్నాము’అని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు  విన్న కోర్టు కవితను మరోమూడు రోజులు ఈడీ కస్టడీ పొడిస్తున్నట్లు ఆదేశించింది.

ఇక..ఢిల్లీ మద్యం కేసులో గురువారం  ఢిల్లీ సీఎం  అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.  ఆయనకు కూడా కోర్టు  ఈ నెల 28 వరకు  ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇవాళ కవితకు మరో మూడు రోజు ఈడీ కస్టడీ పొడగింపుతో ఇద్దరీని ఒకేసారి ఈడీ విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు  ఢిల్లీ మాజీ డిప్యూటీ  సీఎం  మనీష్‌ సిసోడియా జ్యుడిషియర్‌ రిమాండ్‌లో ఉ‍న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement