
దొడ్డబళ్లాపురం: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హొరనాడుకు బయలుదేరిన పర్యాటకుల వాహనంపై అడవి ఏనుగు దాడి చేయడంతో నలుగురు గాయపడిన సంఘటన మూడిగెరె వద్ద చోటుచేసుకుంది. చిక్కమగళూరు తాలూకా కుప్పళ్లికి చెందిన చంద్రన్న, మోహిని, బాలుడు అవనీష్, రాధమ్మ ఏనుగు దాడిలో గాయపడ్డారు. వీరంతా సోమవారం ఉదయం హొరనాడు అన్నపూర్ణేశ్వరి దర్శనానికి ఓమ్ని వ్యాన్‌లో బయలుదేరి మూడిగెరె తాలూకా కుందూరు వద్ద వెళ్తుండగా అడవిలో నుంచి దూసుకువచ్చిన ఏనుగు ఒక్కసారిగా వాహనాన్ని తొడంతో ఎత్తి విసిరేసింది. వ్యాన్ నుజ్జుగుజ్జు కాగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
హొంగనూరు చెరువులో ఏనుగులు ఠికాణా
దొడ్డబళ్లాపురం: చెన్నపట్టణ తాలూకా హొంగనూరు గ్రామంలోని చెరువులో ఆరు అడవి ఏనుగుల మంద ఠికాణా వేసి ఉండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆకలి వేసినప్పుడు పంట పొలాలపైపడి తరువాత నీటిలో దిగి జలకాలాడుతున్నాయి. ఏనుగుల భయంతో చుట్టుపక్కల పొలాలు, తోటలకు రైతులు పనులకు వెళ్లలేకపోతున్నారు.