మహువా లోక్‌సభ బహిష్కరణ సిఫార్సుకు.. ఎథిక్స్‌ కమిటీ ఆమోదం | Ethics Panel Approves Mahua Moitra's Expulsion From Parliament | Sakshi
Sakshi News home page

మహువా లోక్‌సభ బహిష్కరణ సిఫార్సుకు.. ఎథిక్స్‌ కమిటీ ఆమోదం

Published Thu, Nov 9 2023 8:25 PM | Last Updated on Thu, Nov 9 2023 8:49 PM

Ethics Panel Approves Mahua Moitra's Expulsion From Parliament - Sakshi

డబ్బులు తీసుకొని పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా కేసులో గురువారం కీలక పరిణామం చోటుచేసుకంది. ఆమెను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును పార్లమెంట్‌ నైతిక విలువల కమిటీ ప్యానెల్‌ ఆమెదించింది.పార్లమెంట్‌ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్‌ కమిటీ తన నివేదికలో పేర్కొంది. 

కాగా వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా  లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. 
చదవండి: మహువాపై సీబీఐ విచారణ

 ఈ కేసులో నిషికాంత్‌ దూబే, న్యాయవాది జై అనంత్‌ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు.  నవంబర్‌  రెండున  లోక్‌సభ ఎథిక్స్‌ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్‌ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం  మహువా కేసులో ఎథిక్స్‌ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది.

ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్కర్‌ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ గురువారం సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. ఈ నివేదికను శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు సమర్పించనున్నట్లు కమిటీ చీఫ్‌,  బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్కర్‌ తెలిపారు

అన్ని చర్చించిన అనంతరం మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్‌ లాగిన్‌ ఐడిని షేర్‌ చేసుకున్నారని, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్‌ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు.

పదిమందే హాజరు
లోక్‌సభ ఎథిక్స్‌ కమిటీలో మొత్తం 15 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. వారిలో బీజేపీ నుంచి ఏడుగురు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు. బీఎస్పీ, శివసేన, వైఎస్సార్‌సీపీ, సీపీఎం, జేడీయూ నుంచి ఒక్కక్కరు ఉన్నారు. నేటీ సమావేశానికి 10 మంది మాత్రమే హాజరయ్యారు. ఏడుగురు బీజేపీ ఎంపీల్లో నలుగురు మాత్రమే హాజరయ్యారు.

మహువా పార్లమెంట్‌ బహిష్కరణను సమర్ధించిన వారిలో కాంగ్రెస్‌ సస్పెండెడ్‌ ఎంపీ, పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ భార్య ప్రణీత్ కౌర్ కూడా ఉన్నారు. ఆమెతోపాటు అపరాజిత సారంగి, రాజ్‌దీప్ రాయ్, సుమేధానంద్ సరస్వతి, వినోద్ సోన్కర్‌, హేమంత్ గాడ్సే మహువాకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఇక నివేదికను వ్యతిరేకించిన వారిలో డానిష్ అలీ, వి వైతిలింగం, పీఆర్ నటరాజన్, గిరిధారి యాదవ్ ఉన్నారు. అయితే  ప్రతిపక్ష నేత సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేసేందుకు నియోజకవర్గానికి వెళ్లడంతో ఆయన ఓటింగ్‌లో పాల్గొనలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ కూడా సమావేశానికి హాజరు కాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement