ముంబై: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీపై వ్యాఖ్యలతో వివాదంలోకి దిగారు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ. ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ బహిరంగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మహా సర్కార్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. శివాజీని అగౌరవపరిచేలా ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి.. గవర్నర్‌కు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు ఆ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి.
ఫడ్నవిస్ భార్య అమృత.. గవర్నర్ కోష్యారీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘వ్యక్తిగతంగా గవర్నర్‌గారు నాకు తెలుసు. మరాఠా సంస్కృతి మీద ఆయనకు ఎంతో గౌరవం ఉంది. ఆయన ఇక్కడికి వచ్చాకే మరాఠీ నేర్చుకున్నారు. మరాఠీలను ఆయన ఎంత ఇష్టపడతారో.. దగ్గరుండి మరీ చూశా. ఆయన ఏదో అన్నారని కాదు. కానీ, మనస్ఫూర్తిగా ఆయన మరాఠాను గౌరవించే మనిషే అంటూ ఆమె విలేఖరులతో చెప్పారు.
ఒకవైపు శివాజీ వ్యాఖ్యల ఆధారంగా గవర్నర్‌పై మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. గవర్నర్ రీకాల్ కోసం ప్రయత్నించాలని మహా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఈ తరుణంలో.. అమృతా ఫడ్నవిస్ వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు బీజేపీని, బీజేపీ-షిండే శివసేన కూటమి సర్కార్‌ను మరింత ఇరకాటంలో పడేశాయి. ప్రతిపక్షాలు అమృత కామెంట్ల ఆధారంగా బీజేపీపై విరుచుకుపడుతున్నారు.
మరోవైపు ఉద్దవ్ థాక్రే.. కేంద్రం అమెజాన్ పార్శిల్‌లో కోష్యారీని పంపించిందంటూ ఎద్దేవా చేశారు. కోష్యారీని తప్పించకపోతే.. అన్ని పార్టీలను పోగుజేసి వ్యతిరేక నిరసనలు కొనసాగిస్తామని థాక్రే హెచ్చరించారు. కేంద్రాన్ని ఉద్దేశిస్తూ.. ‘‘మీరు పంపిన శాంపిల్‌ను మీరే తీసుకెళ్లండి. ఒకవేళ ఆయన్ని ఓల్డేజ్ హోంకి పంపించాల్సి వస్తే ఆ పని చేయండి. అంతేకానీ ఈ రాష్ట్రంలో మాత్రం ఆయన్ని ఉంచకండి అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేశారు థాక్రే. మరోవైపు గవర్నర్ వ్యాఖ్యలపై నిరసన కోసం.. థాక్రే శివసేన వర్గపు నేత సంజయ్ రౌత్.. కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్‌ను కలిసి చర్చించారు. ఇదిలా ఉండగా.. శివాజీపై వ్యాఖ్యల నేపథ్యంలో గవర్నర్ కోష్యారీని కేంద్రం ఢిల్లీకి పిలిపించుకున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: శివాజీపై గవర్నర్ వ్యాఖ్యలు.. గడ్కరీ ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment