సాక్షి న్యూఢిల్లీ : పార్లమెంట్ అనెక్స్ భవనంలో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులో మంటలు వెలువడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. షార్ట్ సర్క్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. అగ్నిప్రమాద ఘటనపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు. (షిఫ్ట్ పద్ధ్దతిలో పార్లమెంట్)
కాగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మార్చి 23వ తేదీన అర్ధంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం.. పార్లమెంట్ చివరి సమావేశాలు జరిగిన ఆరు నెలల్లోగా సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని రాజ్యసభ సెక్రటేరి యట్ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని మొదటిసారిగా పలు ముందు జాగ్రత్త చర్యలు, ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. దీన్లో భాగంగా, ఈసారి ఉభయ సభలు ఒకదాని తర్వాత మరోటి సమావేశం కానున్నాయి. ఉదయం ఒక సభ జరిగితే, మరో సభ సాయంత్రం సమావేశమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment