
ముంబై: భారత విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో మంటలు చెలరేగి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించినట్లు నేవీ ప్రతినిధి తెలిపారు. నౌకలోని సిబ్బంది పొగను గమనించి వెంటనే మంటలను ఆర్పడానికి ప్రయత్నించారని అన్నారు. దీంతో సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారని, పెద్దగా నష్టం జరగలేదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ యుద్ద నౌక కర్ణాటకలోని కార్వార్ నౌకాశ్రయంలో ఉందని, ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని నేవీ ప్రతినిధి అన్నారు. కీవ్-క్లాస్ అనే యుద్ధ నౌకను భారత్ 2013లో రష్యా నుంచి కొనుగోలు చేసి, దానికి విక్రమాదిత్య చక్రవర్తి పై గౌరవార్థం ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యగా పేరు పెట్టారు. 20 అంతస్తుల ఎత్తు, 22 డెక్స్‌తో సుమారు 1600 మంది సిబ్బంది సామర్ఠ్యం కలిగిన ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య పొడవు 284 మీటర్లు, 60 మీటర్ల బేస్‌తో మూడు ఫుట్‌బాల్ మైదానాల వైశాల్యం కలిగి ఉంది.